Pages

Thursday, 16 May 2013


ఇంగ్లీషు ఆలోచన – తెలుగు ఆలోచన (1)
(English Thinking and Telugu Thinking) (1)

ముందుమాట
ఆలోచించడం ఎలా? ఆలోచించడం వ్యక్తిగతమా? నేర్చుకునే విద్యా? విద్యార్థులకు సవ్యంగా, సరళంగా, సమస్యలను పరిష్కరించే మార్గంలో, సరియైన నిర్ణయాలు తీసుకో గలిగినట్లు ఆలోచించే విధానాలను నేర్పగలమా? ఇది విద్యావేత్తలకు వస్తున్న ప్రశ్న.    ఆలోచనా విధానంలో ఇంగ్లీషు ఆలోచనా విధానం, తెలుగు ఆలోచనా విధానం, భారతీయ ఆలోచన విధానం, హిందూ ఆలోచనా విధానం, మహమ్మదీయ, క్రైస్తవ ఆలోచనా విధానాలు - ఇలా అనేక రకాలు ఉంటాయా?  నిశ్చయంగా ఉంటాయి. (ఎందుకంటే మనమందరమూ ఒక చట్రములో ఆలోచించడానికి అలవాటు పడ్డాము.) భారత దేశంలో మన విద్యావ్యవస్థ అంతా మెకాలే నాటినుండి నేటి వరకు ఇంగ్లీషు విద్యావిధానం  ఆధారంగానే నడుస్తున్నది. ఈ మధ్య ఇంజనీరింగ్ విద్యా విధానాలలో ఆవశ్యకమైన మార్పుల గురించి మిత్రుడు ప్రొఫెసర్ ఎన్.జె.రావు తో ముచ్చటిస్తోంటే పై విషయం చర్చ కు వచ్చింది. ఆస్ట్రేలియాలో మైకేల్ హెవిట్ గ్లీసన్ అనే Cognitive Science  ప్రొఫెసర్, ఇంగ్లీషు ఆలోచనా విధానం (English Thinking) ఆధారంగా School of Thinking అని ప్రారంభించి అనేక వందలమందికి శిక్షణ ఇచ్చాడు. నా మిత్రుడు నన్ను ఇంగ్లీషు, ఇండియన్ ఆలోచనా విధానాలను  విశ్లేషించగలరా? అని అడిగాడు.  ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.    
మనం ఆలోచించే సాధనం మస్తిష్కం (మెదడు), ఇది తలలో ముఖ్యభాగం. తలలు ఎక్కువైతే ఆలోచనలు పెరుగుతాయా? బ్రహ్మకు నాలుగు తలలు ఉంటే ఆలోచనలూ, జ్ఞాన, విజ్ఞానాలు  మనకంటె ఎక్కువా? ఐతే పదితలల రావణాసురుని ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ఆలోచన ఇప్పుడు శాస్త్రవేత్తలకు వచ్చింది. భౌతికంగా కనపడకపోయినా, వేర్వేరు రంగు టోపీలు ధరించవచ్చు కదా. ఎడ్వర్డ్ డిబోనో అనే ఆయన Six Hat Thinking అనే ఆలోచనా విధానాన్ని రూపొందించాడు. తెలుపు, ఎరుపు, నలుపు,పసుపు, ఆకుపచ్చ, నీలం టోపీలు ధరించి ఆలోచించడమన్న మాట. ఒకోటోపీతో ఒకోరకం ఆలోచనలు చేస్తాడు. ఒక సమస్యను పరిష్కరించడానికి జరిపే మేధోమధనంలో (Brain Storming)  ఈ విధానం ఉపయోగిస్తుంది. ఇది కూడా ఒక చట్రమే.మనం ఆలోచనా విధానాన్ని బోధిస్తున్నామంటే వాళ్ళకు  కొత్త మూసలను (new frameworks) ఇస్తున్నామని అర్థం.      
ఈ విశ్లేషణలో మొదట ఇంగ్లీషు (English) , ఆలోచన (Thinking) అనే పదాలను ఈ సందర్భంలో వాటి అర్థాలనూ చూడాలి. ఇంగ్ల్లీషు అంటే - ఒక భాషా, ఒక సంస్కృతియా. ఒక దేశమా, ఇంగ్లీషు మాట్లాడే అన్ని దేశాలూనా, లేదా క్రైస్తవ మత ప్రాబల్యంగల పాశ్చాత్యదేశాలా? - ఈ ప్రశ్న వస్తుంది. ఒక ఆస్ట్రేలియా ప్రొఫెసరు దీనిని ప్రచారంచేస్తున్నాడు కనుక, ఇది ముఖ్యంగా క్రైస్తవ మత ప్రాబల్యంగల పాశ్చాత్య-ఆలోచనా విధానమని చెప్పుకోవాలి.  ఇంగ్లీషు భాషలో ఈ పద్ధతికి గల ప్రచారం వలన  ఇంగ్లీషు పద్ధతి అంటున్నాము. అలాగే భారతీయ పద్ధతిని అందులో అంతర్భాగమైన తెలుగు పద్ధతి అనవచ్చు. ఇక రెండవ పదం thinking. Thinking తోభాటుగా Thought, Thinker  పదాలను గురించి కూడా ఆలోచించాలి.
మనోవృత్తి, ఆలోచన -- Thinking, Thought  
అసలు thinking అనే ఆంగ్లపదానికి, ఆలోచన అనేది సరియైన అనువాదమేనా? ఈ ప్రశ్న వచ్చింది. సమాధానం దొరికింది. ఈరెండిటికీ ఉపకరణాలు ఏమిటి? thinking మనస్సుతో చేస్తాము. ఆలోచనకు కావలసినవి కన్ను, మనస్సు. లోచన అంటే కన్ను.దానికి సంబంధించినదే ఆలోచన (looking at). కన్నుతో చూసినతరువాత దానిని అర్థంచేసుకునే ప్రయత్నం ఆలోచన. లోకన అంటే చూడటం. ఉపసర్గలతో అనేకపదాలు వచ్చాయి. సులోచన, విలోచన, సమాలోచన, ఆలోకన, అవలోకన వంటివి.  మన శబ్దనిధి లేదా శబ్దకోశం (vocabulary) సమృద్ధిగా ఉంటేనే మనం సందర్భోచితమైన పదం వాడగలము. ఆలోచనలను గురించిన పదాలు ఇంకా తెలుసుకోవాలి. (సంస్కృతపదాలు) ఆలోచన, యోచన, చింత, వితర్కము, ధ్యానము (ధ్యాస), స్మరణ, విచారము, విమర్శ, సమీక్ష, భావము, .. వివేచన అంటే వివేకం తో కూడిన ఆలోచన (thinking with discrimination).  ఇన్నిపదాలు ఆలోచనను గురించినవి ఉన్నాయి. వీటికి క్రియారూపాలు ఆలోచించుట, చింతించుట, విచారించుట, తర్కించుట, యోచించుట విమర్శించుట, భావించుట .. ఇలా అనేకం) (తెలుగు పదాలు) తలపు, ఎన్నిక(తలపోయుట, తలంచుట,ఎంచుట, అనుకొనుట,ఎన్నుకొనుట) పదాల వాడుకలో తేడాలు, అర్థాలలో అనేకఛాయలు (shades of meaning) ఉంటాయి. పారిభాషిక పదాలు కావాలంటే తెలుగుకు సంస్కృతపదాలే శరణ్యం.
జిడ్డు కృష్ణమూర్తి గారు Thinker, Thinking, Thought ఈ మూడింటినీ గురించి ఒకేసారి ఆలోచించాలి అంటారు. ఇది ఇంగ్లీషులో చెప్పినా అసలు సిసలైన భారతీయభావన. అద్వైతంలో దృగ్దృశ్య వివేకము అని ఒక తత్త్వము ఉంది. The Seer and the seen) ఇక్కడ మూడవది దృష్టి, దృశ్యము. నీకు కనపడేది నీ సంస్కారానిబట్టి, నీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఆలోచనలు అంతే.  మొదట thinker కి తెలుగు చూదాం. జిడ్డు కృష్ణమూర్తి గొప్ప ఆలోచనా పరుడు అంటే సరిపోదు ఆయనకు. అది కేవలము ఆలోచించే ప్రతి వాడినీ సూచిస్తుంది. సంస్కృతంలో చింతకః, చింతకుడు అనే పదం ఉన్నది.కాని సూరి, ముని, తత్త్వవేత్త పదాలుకూడా thinker కి సమానార్థకాలు.
ఆలోచన – తర్కము
భారతీయ (అంటే నిజంగా హిందూ) ఆలోచనావిధానానికి ఇంగ్లీషు (అంటే పాశ్చాత్య, క్రైస్తవ) ఆలోచనా విధానానికి ఎందులో వ్యత్యాసము ఉంది? అని ఆలోచిస్తే మనకు తెలియకుండా మన సంస్కారాలలో మనకు అంతర్గతంగా ఉన్న, వారి సంస్కారాలలో వారికి ఉన్న తర్కంలో తేడాలు అని అర్థం అవుతుంది.  ఇది మొదటి భేదం.  
పాశ్చాత్య తర్కం గ్రీకు తత్త్వవేత్తలైన ప్లేటో, సోక్రటీసు,అరిస్టాటిలు, వీరి తత్త్వ శాస్త్రం మీద క్రైస్తవ మతం, చర్చి వ్యవస్థ, విజ్ఞాన శాస్త్రం, నాటినుండి నేటి వరకు ఆధార పడి ఉన్నాయి. మన తర్కానికి అంతకన్న ఎక్కువ చరిత్ర ఉంది. గౌతముడు, కణాదుడు, కపిలుడు, పతంజలిలతో మన తత్త్వ శాస్త్రం ముడిపడి ఉంది. తరువాత, బౌద్ధులు, జైనులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు తర్కాన్ని ఆధారంచేసుకునే తమ తమ మత సాంప్రదాయాలు నిర్మించుకున్నారు. దురదృష్టవశాత్తూ మన దేశం వేయి సంవత్సరాల బానిసత్వంలో మన ఆలోచనాసరళిని మరచిపోయి, ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోలేక దిక్కుతోచని స్థితిలో పడింది. మహమ్మదీయులు దేశాన్ని రెండుగా విభజిస్తే , మెకాలే తన విద్యా విధానం ద్వారా మన మస్తిష్క ప్రక్షాలన (Brain Washing) మొదలు పెట్టాడు. స్వతంత్ర భారతం అదే విధానాన్ని ఆలోచనారహితంగా అనుసరిస్తుంది.   మన గ్లోబలైజేషన్ సమస్య, తరాల అంతరాలు ఈ విధానం ఫలితాలు.  గ్రీకుల తర్కం ఇలాఉంటుంది. (Deductive Logic). సోక్రటీసు మర్త్యుడు. (అంటే మరణించే లక్షణం గలవాడు). మర్త్యులకు మరణం సహజధర్మం. ఈ రెండు వాక్యాలు ఇస్తే సోక్రటీసుకు మరణం సహజధర్మం [(ఎప్పుడో తప్పక) మరణిస్తాడు]. అనే సత్యవాక్యాన్ని సాధించగలుగుతాం.   
మనం ఈ ఆలోచనా విధానంలో తేడాలు మనం ఉపయోగించే తర్కం (Logic) వలన అని గమనించాం. పాశ్చాత్య విధానంలో ఒకవాక్యం అయితే సత్యం, లేకపోతే అసత్యం అవుతుంది. అయితే పుణ్యం కాక పోతే పాపం. అయితే శత్రువు కాకపోతే మిత్రుడు. శత్రువూ, మిత్రుడూ కూడా కాని వాడు ఒకడు ఉండవచ్చు అనే ఊహ పాశ్చాత్యులకు రాదు. దీని ఫలితమే మనం ఈరోజు ఆంధ్రలో చర్చిగోడలపై చూచే రాతలు. మా  ఊరిలో ఒక చర్చి ఈ బోర్డు పెట్టింది. "యేసు క్రీస్తు నమ్మినవారిని రక్షించును, నమ్మనివారిని శిక్షించును." వీళ్ళ దృష్టిలో - కరుణామయుడైన యేసుకి, నన్ను నమ్మినవారిని నేను రక్షించుకుంటాను నన్ను నమ్మని హిందువులను వారి శివుడో, రాముడో, కృష్ణుడో రక్షింపకపోతాడా? - అన్న కనీస జ్ఞానం, సహనం ఉండదా? ఇది వాళ్ళ తర్కం తెచ్చిన ప్రమాదం. దీనిని Inside the square thinking అంటారు. నాదేవుడే సత్యం. నా ప్రవక్తదే అంతిమనిర్ణయం అనే తప్పుడు భావాలకు మూలం గ్రీక్ లాజిక్ లో  కనపడుతుంది. మరి మన తర్క శాస్త్రం ఏం చెబుతుంది? ప్రతి వాక్యములోనూ సంశయం ఉంటుంది. దానియొక్క సత్యాసత్యాలను అనేక ప్రమాణాలతో నిరూపించుకోవాలి. ఈ ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం (శబ్దం), ఉపమానం, అర్థాపత్తి, అనుపలబ్ధి, అభావం, ఐతిహ్యము ఇలా. ఒక దానికంటె ఒకటి బలహీనమైనవి. మన పరమత సహనానికి మూలమిదే. మన ఋషులు ఇచ్చిన న్యాయ తర్క శాస్త్రాలు. మన విశాలహృదయం కాదు. మన ఆలోచనావిధానం.      
భారతీయ ఆలోచనా విధానం  
భారతీయ ఆలోచనా విధానాలకు మూలాలు వేదవాఙ్మయంలో ఉన్నాయి. మనం ముఖ్యముగా గుర్తుంచుకోవలసిన వారు దార్శనికులైన మహర్షులు, శ్రీకృష్ణుడు, అరిష్టనేమి, మైత్రేయ మహర్షి, గౌతమ బుద్ధుడు,  ఆదిశంకరులు, రమణ మహర్షి ఈ పరంపరలోని అవతారమూర్తి జిడ్డు కృష్ణమూర్తి. ఆయన ముఖ్య బోధ "You Have to Find Out Yourself."  ఇది భారతీయ తత్త్వ శాస్త్రానికి పరాకాష్ఠ.
ఆలోచన - భాష
ఇంగ్లీషు ఆలోచనా విధానానికీ, తెలుగు ఆలోచనా విధానానికి భేదం ఉండడానికి రెండవ ముఖ్య కారణం భాష. భాషకు ఆలోచనకు సంబంధం ఉన్నదా? ఇది ఆలోచింపదగిన విషయం. ఉదాహరణకు నేను తెలుగులో ఆలోచిస్తానా, ఇంగ్లీషులో ఆలోచిస్తానా? కాకపోతే నేను ఇంగ్లీషుతో ఆలోచిస్తానా? తెలుగుతో ఆలోచిస్తానా? (Do I think in English? Do I think with English? Is my thinking independent of any language?) ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. తెలుగు నా ఆలోచనకు మాధ్యమమా? లేక ఉపకరణమా? కొంతవరకు ఇది మనము చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఇంజనీరింగ్ పరిశోధనలో తెలుగుకు ఉపయోగం తక్కువ. తెలుగు భాష భవిష్యత్తు గురించి వ్యాసం వ్రాస్తూంటే పూర్తిగా తెలుగులోనే ఆలోచన  ఉంటుంది. తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీషులోనికి అనువదిస్తుంటే రెండు భాషలు కావాలి. కాని అవి చాలవు.అదేమిటి అంటారా? నేను గత 4 నెలల నుండి "శ్రీకృష్ణ తత్త్వము" అనే తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీషులోనికి అనువదిస్తున్నాను. ఆన్ లైన్ మీద ఇంగ్లీషు-తెలుగు-సంస్కృతం నిఘంటువులు తరచు వాడవలసి వచ్చింది.   కృష్ణ పుస్తకంలో ఒక వాక్యం ఇలా ఉన్నది. "యజ్ఞములోవాడే స్రుక్స్రువములకు కర్మఫలం వస్తుందా?" దీనిని ఇంగ్లీషులోకి ఎలా అనువదించాలి? అసలు మాటలు అర్థం అయితే కదా అనువాదం. ఏ నిఘంటువులోనూ దొరకలేదు. స్రుక్, స్రువము విడిగా  చూస్తే అర్థాలు దొరికాయి. యజమాని అగ్నికి ఆవునేతితో ఆహుతులు ఇస్తాడు. ఒక కొయ్య గరిటతో ఆవునేతిని తీసుకొని ఇంకొక గరిటలో వేసుకొని ఆజ్యాన్ని అగ్నికి సమర్పిస్తారు. స్రువము పెద్దగరిట, స్రుక్కు చిన్నది.  యజ్ఞం, కర్మ, కర్మఫలం, స్రుక్కు,  స్రువము ఇవన్నీ అనువదించలేని పదాలే.   
పాశ్చాత్యుల ఆలోచనా విధానం - రెండవదశ
పాశ్చాత్యుల ఆలోచనా విధానం నేటికీ గ్రీకు లాజిక్ స్థాయిలో ఉన్నదని చెప్పడం నాఉద్దేశ్యం కాదు. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధితో వారి వివేక విజ్ఞానాలు, గ్రీకు లాజిక్ పరిధిని నాలుగు, ఐదు శతాబ్దాలక్రితమే దాటాయి.  ఈ వ్యాసంలో నాభావాలు ఎన్నో పాశ్చాత్య విజ్ఞానం చదవడం వల్లనే కలిగాయి. శాస్త్రజ్ఞులకు, సామాన్య పౌరులకు వచ్చిన వివేకం ఇంకా మతపెద్దలను చేరింది అని చెప్పడం కష్టం. దీని వలననే నేడు యూరప్ లో క్రైస్తవ మతం పై  ఆదరణ తగ్గి, బౌద్ధం పై ఆదరణ పెరుగుతూంది. మధ్య ఆసియా ఈ పరిణామంలో వెనుక ఉంది.  శాస్త్రీయపద్ధతి పరిధిని అతిక్రమించిన తర్కానికి (thinking out of square) దారితీసినది. గెలీలియో (సా.శ. 1564-1642) కోపెర్నికస్ సిద్దాంతాన్ని తన పరిశోధనా ఫలితాల  ద్వారా నిరూపించాడు. భూమి, ఇతరగ్రహాలు  సూర్యునిచుట్టూ తిరుగుతాయన్న ఈ ఫలితాన్ని పోప్ పాల్ V,  అర్బన్ VIII (వాళ్ళు ఇప్పటికీ కాలం చెల్లిన ఈ రోమన్ అంకెలనే వాడుతారు.) తీవ్రంగా వ్యతిరేకించారు. 1633లో  కాథొలిక్ చర్చి గలీలియోకు గృహనిర్బంధం విధించింది. చర్చిచేసిన అనేక తప్పులు ఒప్పుకుని పోప్ జాన్ పాల్ II, 2000 సం. లో క్షమాపణలు చెప్పాడు.     
ఈ విశ్లేషణలో పాశ్చాత్యులను కించపరచి, మనను పొగడుకునే ఉద్దేశ్యంలేదు. నిస్సందేహంగా వారు నాగరికులు. సింధు నాగరికత తరువాత మనకు చెప్పుకోదగ్గ నాగరికత లేదు.మనకు ఉన్నది సంస్కృతి. దానిని కూడా స్వతంత్రభారత దేశములోక్రమముగా కోలుపోతున్నాము. నాగరికత నగర జీవనానికి సంబంధించినది. మన నగరాలను చూస్తే మన నాగరికత అర్థం అవుతుంది. నాగరికతకు చిహ్నం పటిష్ఠమైన పరిపాలనావ్యవస్థలు. మన పౌరులకు పౌరసత్వపు విలువలు లేవు. మనము ఎన్నుకునే ప్రజాప్రతినిధులు మన లోపాలకు, మన వెనుకబాటు తనానికి నిజమైన ప్రతినిధులు.   

ఆలోచన – భాష
నాదృష్టిలో ఆలోచనకు భాషకు సంబంధంలేదు. అది ఇంకొకరితో పంచుకోడం వరకే భాష అవసరం. మీకూ ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది. దానికి భాష ఎందుకు? ఆవ్యక్తి యొక్క క్షేమం గురించి, ఆరోగ్యంగురించి, పరిస్థితిని గురించీ ఆందోళన చెందుతారు. దీనికి భాష అవసరంలేదు. మీరు ఆ వ్యక్తికి ఫోన్ చేయదలచుకుంటేనో, ఉత్తరం వ్రాయ దలచుకుంటేనో అప్పుడు భాష కావాలి.అందుకే మూగభాషలు, మూగ మనసులు వచ్చాయి. "మౌనముగా నీ మనసు పాడిన వేణు గానం ..." వంటి గేయాలు ఆ మూగ భాషను గురించి మీకు చెప్పటానికి వచ్చాయి. ఆలోచనలు మనో భావాలు. భాషలు వాటి శబ్ద చిత్రాలు.  
ఒక భావాన్ని మాటలలో చెప్పాలంటే ఏభాషకు ఆభాష విధించే పరిమితులుంటాయి. తెలుగులో మనం రేపు బయటకు వెళ్ళాలి. మేము రేపు బయటకు వెళ్ళాలి. ఈ రెండు వాక్యాలకు అర్థబేధం ఉంది. ఇంగ్లీషులో "We shall go out tomorrow"లో కొంత సంశయం ఉంది. ఇంతే కాక మన ఆలోచనాశక్తికి మన భాషాజ్ఞానం పరిమితులు విధిస్తుందా? ఇంగ్లీషు మాతృభాష గా కలవాళ్ళ ఆలోచనలకు, మన వలె రెండవ భాష గా నేర్చుకున్న వారి ఆలోచనలకు తేడా ఉంటుందా?   Last evening I went to a friend's house." తెలుగులో చెప్పాలంటే స్నేహితుడా?  స్నేహితురాలా? అనే ప్రశ్న వస్తుంది.
ఇంగ్లీషు ఆలోచనా విధానానికి, తెలుగు ఆలోచనా విధానానికి, అష్ట విధములైన భేదాలు ఉన్నయి. అవి: 1. ప్రపంచమును గురించిన దృష్టి  2.తననుగురించిన అంచనా,3. చిత్తవృత్తి,  శ్రద్ధ,  మనో నిగ్రహం  4. విమర్శ, పరామర్శ, తార్కిక శక్తి యుక్తులు 5. భాషా పటిమ, వాద పటిమ 6. పదార్థ విశ్లేషణా చతురత 7. ప్రగతికి అవకాశాలు 8. బహుముఖ విశ్లేషణాశక్తి
భారతీయ ఆలోచనా విధానాలకు మూలాలు వేదవాఙ్మయంలో ఉన్నాయి. మనం ముఖ్యముగా గుర్తుంచుకోవలసిన వారు దార్శనికులైన మహర్షులు, శ్రీకృష్ణుడు, అరిష్టనేమి, మైత్రేయ మహర్షి, గౌతమ బుద్ధుడు,  ఆదిశంకరులు, రమణ మహర్షి ఈ పరంపరలోని అవతారమూర్తి జిడ్డు కృష్ణమూర్తి. ఆయన ముఖ్య బోధ "You Have to Find Out Yourself."  ఇది భారతీయ తత్త్వ శాస్త్రానికి పరాకాష్ఠ. 
కృష్ణుడు ఉపనిషత్తుల సారాన్ని సమన్వయం చేసి, అనేక యోగాలను గురించి బోధించి, నీ దారి నీవు ఎన్నుకో అన్నాడు.అరిష్టనేమి  చెప్పిన నిర్గుణ ఉపాసనను కు మార్గంగా తన సగుణమార్గాన్ని ప్రతిపాదించాడు. అరిష్టనేమి నిర్వాణ సమయములో ఆయన తేజస్సు కృష్ణునిలో చేరింది. కలియుగంలో ప్రజలకు యజ్ఞాలు, తపస్సులు  చేసే శక్తి ఉండదని గ్రహించి, ఈ వైదిక మార్గాల ప్రాముఖ్యతను తగ్గించాడు. భక్తిని ప్రతిపాదించాడు. శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో తన జ్ఞానాన్ని, కలియుగానికి తన ప్రణాళికనూ మైత్రేయ మహర్షికి అందించాడు. భగవద్గీతను బొధించి జగద్గురువయ్యాడు. మైత్రేయుడి ద్వారా ప్రపంచంలో గురు సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టాడు. దీనిని ప్రజలకందించి వ్యాసుడు ఆ పరంపరకు  ఆద్యుడయ్యాడు.      మళ్ళీ ఆయనే బుద్ధుడుగా వచ్చి, వేదకర్మలను నిరసించి హేతువాదాన్ని ప్రోత్సహించాడు. శంకరులు దానిని తన అద్వైతంతో సనాతన ధర్మంలో కలిపి వేశారు. కృష్ణమూర్తిగారి పేరులో కృష్ణ ఉన్నది. ఆయనను మైత్రేయ మహర్షి అవతారంగా భావించి దివ్యజ్ఞాన సమాజం వారు  ఆయననును జగద్గురువుగా ఛేయడానికి ఇంగ్లాండు తీసుకు వెళ్ళారు.  ఆయన అదితిరస్కరించి, తనదైన పద్ధతిలో తన అలోచనలను వ్యక్తం చేశారు.ఆయన ఇంకొక ముఖ్యబోధ "Truth is a pathless land. ఆయన చెప్పినవిద్యావిధానం. పిల్లలకు నేర్పవలసినది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం కాదు, సరిగా ప్రశ్నించడం.  ఇది రమణ మహర్షి బొధను  "నేనెవరిని?" అని నీకు నువ్వు సమాధానం వెతుక్కో" గుర్తుచేస్తుంది.     
         

1 comment:

  1. చక్కని సందేశంతో ప్రారంభించారు. స్వాగతం.. సుస్వగతం సార్.

    ReplyDelete