Kathopanishad-4
19
న సాంపరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యన్తం విత్తమోహేన మూఢం
అయంలోకే
నాస్తి పర ఇతిమానీ
పునః పునర్వశమాపద్యతే మే (2.6)
ధనమోహంచేత మూఢులు ప్రమాదంలో పడతారు. వారి మనసులో ఉత్తరలోకములు భాసించుటలేదు. తమ మరణానంతర స్థితిగతుల యోచన లేదు.ఈలోకం కాక పరలోకంలేదు.ఇలా అనుకునేవారు మాటి మాటికీ నాపాలబడుతున్నారు. "పునరపి
జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం" అనే గతిలోనే వారు ఉన్నారు.
శ్రవణాయాపి బహుభిర్యో నలబ్ధః
శృణ్వంతో2పి బహవో యం నవిద్యుః
ఆశ్చర్యోవక్తా కుశలో2స్యలబ్ధా
ఆశ్చర్యో
జ్ఞాతా కుశలానుశిష్టః (2.7)
పరమార్థ
వస్తువు అనేకుల బోధలు వినుటవలన దొరకదు. ఒకవేళ లభించి వినినా దానిని తెలుసుకోవడంలేదు. దానిని గురించి చెప్పేవారు అరుదు. విని విషయము గ్రహించినవాడు కుశలుడు.
యముని
భావం ఇది: గురు ముఖతా ఈ విషయం వినాలి. విషయం పూర్తిగా తెలిసిన గురువులు అరుదు. వారు లోకంతో సంబంధాలు పెట్టుకోరు. వారంతవారు ఉపన్యాసాలు ఇవ్వరు. వింటే అర్థమవడం కూడా కష్టమే. ఎక్కడనైన పరమసత్యం బోధింపబడి, గ్రహించే శ్రోత శిష్యునిగా దొరికితే ఆశ్చర్యమే సుమా. ఇవన్నీ
చెప్పి యముడు విషయానికి వస్తాడు.
న నరేణావరేణ ప్రోక్త ఏష
సువిజ్ఞేయో బహుధా చింత్యమానః
అనన్య
ప్రోక్తే గతిరత్ర నాస్తి
అణీరాన్హ్య తర్క్య మణుప్రమాణాత్
(2.8)
ఇది (ఈ బ్రహ్మవిద్య) సామాన్యుడైన నరునిచేత చెప్పబడినప్పుడు అనేక విధములుగా వర్ణించి చెప్పబడుతున్నది. అనుభవంలేని సామాన్యుడు అనేకవిధములుగా ఆలోచిస్తాడు.ఇన్ని విధములుగా చింతిస్తే ఇంకా క్లిష్టంగా అవుతుంది. ఇది తేలికగా చెప్పబడేది, తేలికగా అవగతం చేసుకొనేదీ కాదు. నరుడు కాక ఇతరుడు చెప్పుట తప్ప మార్గంలేదు. ఇది తర్కించలేనిది. సూక్ష్మమైనది. బహుధా ఆలోచించడం వలన ప్రయోజనంలేదు.
20
మంత్రములు 7,8 బ్రహ్మవిద్య గొప్పతనాన్ని, గ్రహించినవాడికి వచ్చే మహా ఫలాన్నీ చెబుతాయి. "ఈ విద్యను "అతర్క్యమానం" అంటే మనో బుద్ధులతో చర్చించడంకాదు సాధనతో ఆఫలాన్ని సాధించుకోవాలి" అని చెబుతున్నది 8వ మంత్రం. వాక్కు సాధనా మార్గాన్ని చెబుతుంది. ధ్యానం జ్ఞానమనే ఫలాన్ని అనుభూతి ద్వారా అందిస్తుంది.
నైషా తర్కేణ మతిరాపనేయా
ప్రోక్తా
2న్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ
యాం త్త్వమాపస్యత్య ధృతిర్బదాసి
త్వాదృఙ్నో భూయా నచికేతః ప్రష్టా (2.9)
ప్రేష్ఠ
(ప్రియ శిష్యా) ఈ ఆత్మ తర్కమువలన పొందదగినది కాదు.మనోబుద్ధి వికాసములచేత తెలిసికొనబడేది కాదు. ఇతరులచేత (జ్ఞానులైన గురువులచేత) చెప్పబడినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నీవు సత్యమైన నిష్ఠతో వచ్చావు. నీవంటి ప్రశ్నలు అడిగేవాడు మాకు కలుగును గాక.
వేద మంత్రములు, ఉపనిషద్రహస్యములైన విద్యలూ అనర్హులకు
తరగతిగదిలో ఎన్నడూ బోధింపబడలేదు. ప్రాచీన భారతీయ విద్యా విధానములో సమర్థులైన గురుశిష్యుల
మధ్యమాత్రమే ఈ విద్యాబోధన జరిగినది. ఒక శిష్యుని అర్హత పరీక్షించి గురువు అతనికి తగిన
జ్ఞానాన్ని, సాధనలో అనుభూతిపొందే మార్గాన్ని బోధించేవాడు.
కేనోపనిషత్తు లోని
శాంతిమంత్రం అందరకూ తెలిసినదే.
ఓం: సహనావవతు సహనౌభునక్తు: సహవీర్యం కరవావహై:
తేజస్వినా వధీతమస్తు: మా విద్విషా వహై: ఓం శాంతిః శాంతిః శాంతిః.
పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. దీనియొక్క భావమిది.
“మన ఉభయులను
భగవానుడు రక్షించు గాక. మనల నిద్ధరిని పోషించు గాక. మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము
గాక. మన అధ్యయనము తేజోవంతము అగు గాక. మనమిరువురము ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము
గాక.” మొదట గురుశిష్యుల అంతఃకరణలు ఒకటి అవాలి.
అలా గురువుయొక్క హృదయానికి సన్నిహితుడైన శిష్యునికే గురువుయొక్క ఆత్మగతమైన భావము అనుభూతమవుతుంది.
అప్పుడు భాష ఉపయోగం తక్కువ. గురువు మూడు మాటలలో చెబుతాడు. దృష్టితో చూస్తాడు. ఇతడు గ్రహిస్తాడు. ధ్యానంలో
అర్థంచేసుకుంటాడు. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో
శిష్యుల సంశయాలుతీరడం ఇటువంటిదే.
(మన సామాన్య సైన్స్, ఇంజనీరింగ్ వంటి విద్యలలో
ఈ పద్ధతి కొంతవరకు Ph.D. మార్గ నిర్దేశనంలో
అనుభవంలోకి వస్తుంది. మన విశ్వవిద్యాలయ ఆచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు చదవగలిగితే
వారి పరిశోధనలలో తప్పక ఉపకరిస్తాయి.)
21
పదవ మంత్రం నచికేతుని భావనలను సూచిస్తుంది. ఈ ఉపనిషత్తులోని ఇతర మంత్రాల వలేనే
నిగూఢంగా ఉంటుంది.
జానామ్యహగ్ం శేవధిరిత్య నిత్యం
నహ్యధ్రువైః ప్రాప్యతే హి ధ్రువం తత్
జానామి
అహం హి ఇతి (నేను నిశ్చయముగా ఎరుగుదును) - శేవధిః (కోశాగారం,ధనం, పాండిత్యం, ఆరోగ్యం, బలం ఇవన్నీ) అనిత్యమ్ (అనిత్యములే). అధ్రువై తత్ ధ్రువం న అప్రాప్యతే (అనిత్యమైన వస్తువులనుండి నిత్యమైన బ్రహ్మ వస్తువు లభించదు.)
తతో మయ నాచికేతశ్చితోగ్ని
రనిత్యైద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యమ్ (2.10)
అనిత్యమైన ద్రవ్యములచేత నచికేతాగ్ని అనే యజ్ఞము నాచేత చేయబడినది. ఇది గురూపదేశం వింటూ నచికేతుడు చేసిన అంతర్యాగం. కాని ఆయజ్ఞము చేతనే నేను నిత్యమైన దానిని పొందగలిగాను. (అనిత్యద్రవ్యైః ప్రాప్తవాన్ అస్మి నిత్యమ్.)
"ఒక వాక్యములో అనిత్యమైన వస్తువులచేత నిత్యమైన బ్రహ్మ వస్తువు పొందబడజాలదు" అని నిశ్చయంతో చెబుతూ నేను శరీరము మొదలగు అనిత్యవస్తువులతో నచికేతాగ్ని అనే క్రతువు చేశాను, నిత్యమైన వస్తువును పొందినవాడను అయ్యాను” అని వెంటనే చెప్పిన మాటకు అర్థం ఏమిటి? అనిత్యమైన యజ్ఞాది కర్మలవలన అనిత్యమైన స్వర్గాది భోగములు వస్తాయి. కాని అతడు యజ్ఞమును అక్కడ ఆపకుండా ఆఫలములనుకూడా యజ్ఞ భోక్తయైన పరమాత్మకే సమర్పించాడు. దేవతలు స్వర్గసుఖాలు కోరినవారికి అవి ఇస్తారు, వానిని స్వీకరించకపోతే ముక్తికారణమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. నచికేతాగ్ని రహస్యం ఇదే. ఆత్మజ్ఞానము శాశ్వతఫలమని అర్థం.
పదకొండవ మంత్రం యముని మాటలు. " ఓ నచికేతసుడా! యజ్ఞాల వలన కోరికలు తీర్చుకోవడమనే సామాన్య గుణాన్ని నీవు వదలిపెట్టావు. శాశ్వతమైన మనోబలం కలవాడవయ్యావు. అంటే నీకు నిత్యానిత్య వివేకం వచ్చింది. మృత్యువు అనేది ఉన్నదని అందరికీ తెలుసు. అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియక భయం, మనోవైకల్యం పొందుతారు. కానినీవు మృత్యువును జయించి అంతకు ఉత్తమమైన బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నావు.
అంటే మృత్యుభయాన్ని తరించి అవతలి ఒడ్డుకు చేరావు. సృష్టిలో సకలము అనిత్యమని, బ్రహ్మ జ్ఞానమే శాశ్వతమన్న స్పురణ నచికేతసునికి కలిగినదని గురువైన ధర్మదేవతయే మెచ్చుకున్నాడు.
22
తరువాత
మంత్రం చాలా ముఖ్యమైనది.
తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం
గహ్వరేష్ఠం పురాణమ్
అధ్యాత్మయోగాది గమేన దేవం
మత్వాధీరౌ హర్షశోకో జహాతి. (2.12)
దుర్దర్శం - కంటికి కనుబడనిది (ఆత్మవస్తువు) శరీరమున్నది కాబట్టి తనకు తాను కనబడుతున్నది. శరీరము లేకపోతే తనకు తాను కనబడడు. అందుకే శరీరమే నేను అనే భావన కలుగుతున్నది. నేను అనేదాని నిజస్వరూపం తెలియటంలేదు. నేను అంటే ఆత్మను అని తెలియడం లేదు. గూఢం అంటే నిగూఢమైనది. అనుప్రవిష్టం అంటే లోపల ప్రవేశించినది. అదే ఆత్మ వస్తువు. "అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత" అని పరమాత్మ చెప్పినది. దూరాన ఉన్న గ్రహాలను, నక్షత్రాలనూ పరిశీలిస్తున్నాము
కాని మన లోపలే ఉన్న ఆత్మను సాక్షాత్కారం చేసుకోలేక పోతున్నాము. ఇట్టి నిగూఢము, రహస్యము ఐన ఆత్మవస్తువు
"గుహాహితం గహ్వరేష్ఠం" ప్రవేశించ వీలులేని హృదయ గుహలో ఉన్నది. పురాణం
- ఇది సనాతనమైనది. శరీరము ఇంద్రియములు దానిని కనుగొనలేవు. తం దేవం - ఆ తేజోమూర్తియైన పరబ్రహ్మ వస్తువు, అధ్యాత్మయోగాది గమేన - ధ్యాన యోగముచేతనే పొందగలిగినది. మత్వాధీరౌ హర్షశోకౌ జహాతి - అట్టి ధీరులు, మహాత్ములు - సుఖదుఃఖాలను జయిస్తున్నారు. ధ్యానయోగము వలన లభించిన జ్ఞానంతో ఈ రెండూలేని ఉత్తమస్థితికి వెళ్తున్నారు.
23
కఠోపనిషత్తులో ఈ (2.12)వ మంత్రసారము, సాధనామార్గములనే
నూరుసంవత్సరాల క్రితం భగవాన్ రమణమహర్షి కావ్యకంఠ
గణపతిమునికి అనుగ్రహించారు.
హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం
హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేన భాతి
హృద్విష
మనసా స్వం చిన్వతా మజ్జతావా
పవన చలనరోధాతాత్మనిష్ఠో భవత్వం.
నచికేతసుడు ఉత్తమశిష్యుడని ప్రశంసిస్తూ, అలాంటి శిష్యులు తనకి కావాలని కోరుతూ ధర్మదేవత చెప్పినది ఈ (2.12) మంత్రం.
ఆత్మ (రమణులు చెప్పిన నేను) మనలోనేఉండి అంతర్యామిగా ఉన్నది. చొరవీలులేని హృదయమనే గుహలో ఉన్నది. ఆ దేవతామూర్తి కరచరణాదులు కల దేవతామూర్తి కాదు. సమస్తదేవతలకు కారణభూతమైన తేజోరూపమైన పరబ్రహ్మ వస్తువు. దానిని తెలుసుకునేమార్గము
అధ్యాత్మిక యోగమే. ప్రాణాయామాది సాధనా పద్ధతులతో ఎవరైతే ధీరుడైన యోగి, మూలాధారము మొదలైన చక్రములను జయించి, ఆత్మదర్శనముచేయగలడో, అతడు సుఖ దుఃఖములనే ద్వంద్వములను విడిచిపెడుతున్నాడు. దేహాత్మభావనలో ఉన్నవారికే సుఖము దుఃఖము. ఎవరైతే శరీరములో ఉండికూడా శరీరమును అధిగమించి వెళ్ళగలుగుతాడో, శరీరముతో అనుభవించే సుఖదుఃఖాలు అతనికి ఉండవు. అనుషంగము
(మోహపూరితమైన సంబంధము, జంజాటము) చేత, ఈషణత్రయము (దారేషణ, పుత్రేషణ, విత్తేషణ) చేతనే
సుఖదుఃఖాలు కలుగుతాయి. ఆత్మ దర్శనమంటే, శరీరానికి దూరమవడమే).
ఏతచ్ఛ్రుత్వా సం పరిగృహ్య మర్త్యః
ప్రవృహ్యధర్మ్యమణుమేతమాప్య
సమోదతే
మోదనీయగ్ం లబ్ధ్వా
వివృతగ్ం
సద్మ నచికేతనం మన్యే (2.13)
మర్త్యుడు (సహజంగా జనన మరణములు కలవాడు) ఇదంతావిని ధ్యానములో విషయము గ్రహించి, జీవాత్మ పరమాత్మల సంబంధమును తెలుసుకొని ఆనందదాయకమైన దానిని సంపాదించి, నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. ఇప్పుడు నచికేతసునికి ఆత్మ అనే గృహం (సద్మ) తెరువబడినది (వివృతమ్).
ఇప్పటి
నచికేతసుని స్థితిని పరీశీలిద్దాం. అతడు పాంచభౌతిక శరీరములోలేడు. అగ్నిరూపములో వచ్చిన అతడు, యముడు ఇచ్చిన ఉదకము (ప్రాణములు) స్వీకరించి లిఙ్గ శరీరముతో (లేదా అంగుష్ఠమాత్ర పురుషునిగా) ఉన్నాడు. ఈస్థితిలో అతడి జీవుడు యమునిబోధ గ్రహించి, అతని భూలోక వాసనలను అధిగమించి తన హృదయములోని పరమాత్మను దర్శించగల అంతర్దృష్టిని పొందినాడు. బోధనాకాలంలోనే అతని హృదయగృహద్వారం తెరువబడి పరమ సత్యము అతనికి లభించినది. అంతర్ముఖునివై బ్రహ్మానుభూతిని పొందమని యముడు శిష్యునికి తన ఆశీస్సును ఇస్తున్నాడు.
24
అన్యత్రధర్మా దన్యత్రాధర్మా
అన్యత్రాస్మాత్ కృతాకృతాత్
అన్యత్ర
భూతాశ్చ భవ్యాచ్చ
యత్తత్పశ్యసి తద్వద (2.14)
ఇక్కడ
విభిన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇంతకు ముందువరకు యముడు చెప్పినది. తత్ వద (అది చెప్పుము) అనే పదములను బట్టి నచికేతసుడు చెప్పిఉండచ్చని కొందరి వ్యాఖ్యాతల అభిప్రాయము. కాని నచికేతుడు గురుబోధలో లీనమై ఉన్నాడు. ప్రశ్న వేసే స్థితిలో లేడు. "పశ్యసి"
అంటే (నీవు) చూచుచున్నావు అని అర్థం. అందుచేత తన అనుభవంలోనికి వస్తున్న సత్యాన్ని చెప్పమని యముడే అడిగాడనుకోవడం ఉచితమనిపిస్తుంది.
సద్గురు శివానందమూర్తిగారి
అభిప్రాయం ప్రకారం మంత్రార్థం ఇది.
ఈ మంత్రము ఆత్మయొక్క ప్రశంస. యముడు (2.12)లో ఆత్మ హృదయగుహలో చూడటానికి, వినడానికీ అతీతమైనదని చెప్పాడు. ఇప్పుడు "ధర్మ స్థానానికి అతీతమైన చోట, అధర్మంలేనిచోట, సమస్తకర్మలకూ స్థానం అయినదీ, కానిదీ అయినచోట భూత భవిష్యత్తులకు అతీతమైన చోట, నీవు ఏమిచూస్తున్నావో నాకు చెప్పు" అని యముడు నచికేతసుడిని ప్రశ్నిస్తాడు.
సమర్థుడైన గురువు ఆత్మతత్త్వము యొక్క అనుభవాన్ని నచికేతసునికి ఇస్తున్నాడు. శ్రుతమౌతున్న విద్య ఆదేవత అనుగ్రహం వలన శిష్యునికి అనుభూతమవుతున్నది. మర్త్యస్థితికి అతీతముగా ఉన్న ఒక జీవుడు, విద్యగ్రహిస్తున్న సమయంలో బోధకు, అనుభవానికి అంతరం లేదని తెలుస్తూంది. ఆ అనుభవం ఎలాఉన్నదో చెప్పుమని యముడు శిష్యుని అడిగాడు. తరువాత శ్లోకములో బ్రహ్మ వస్తువు రహస్యమును గురించి, నచికేతుడు సమాధానం ఈయకుండానే, ఇంకా వివరిస్తున్నాడు. గురువు కొన్ని ప్రశ్నలు వేసి, దానికి తానే సమాధానాలు చెప్పడం విద్యాబోధనలోని ఒక ఉత్తమ విధానం.
తరువాత
మంత్రము లో బ్రహ్మ విద్యలో భాగంగా "ఓం"
అనే ప్రణవ మంత్ర రహస్యాన్ని చెబుతాడు.