Pages

Sunday, 9 June 2013

కఠోపనిషత్ (Retold from Katha Yoga (English) and కఠయోగము (తెలుగు) of Sadguru K. Sivananda Murty garu)


 కఠోపనిషత్

1

అప్పుడప్పుడు మనం భగవద్గీతను గురించీ, మహాభారతం గురించీ, పురాణాలగురించీ చెప్పుకుంటున్నాము. వీని మూలగ్రంధాలగురించి తెలుసుకోవాలి. అవి వేదాలు. సంహితా, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనేవి వేదభాగాలు. మొదటి మూడు భాగాలు యజ్ఞము, ఉపాసనా మార్గాల గురించి చెబుతాయి. ఉపనిషత్తులు జ్ఞానాన్ని ఇస్తాయి. వేదము యొక్క అంతరార్థాన్ని చెబుతాయి. భగవద్గీతను శ్రీకృష్ణుడు అన్నిఉపనిషత్తుల సారంగా, క్లుప్తంగా చెప్పాడు. మనకి మతం, పరమాత్మ, జ్ఞానం, గురించి వేధించే సంశయాలను నివారించుకోవాలంటే ఉపనిషత్తులే శరణ్యం. చిన్నదీ, అత్యంతగూఢమైనది, శ్రేయోదాయకమైన మార్గాన్ని చూపేది, కఠోపనిషత్తు. చిన్న పురాణకథలా కనుపిస్తూ, అద్భుతమైన సత్యాలను ఆవిష్కరిస్తుంది.
ఉపనిషత్ అనే పదం ఉప+ని+ సత్ (సద్), సత్ అనే పదానికి ముందుచేరిన రెండు ఉపసర్గల నుండి వస్తుంది. గురువు సమీపములో కూర్చుని సద్వస్తువునిగురించిన జ్ఞానాన్ని గ్రహించడం దీని అర్థం. మానవ జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే ఘట్టం మృత్యువు. దీనికి సంబంధించిన జ్ఞానాన్ని, నాచికేతుడనే మునికుమారునికి మృత్యుదేవతయైన యమధర్మరాజు ఈయడం దీనిలోని విషయం. ప్రతి వ్యక్తికీ ఉండే సహజ లక్షణం తన మృత్యువును గురించిన భయం, సన్నిహితులమరణం గురించిన దుఃఖం. మరణానంతరం ఏమిటి? అనేది ప్రశ్న. మన విశ్వాసాలుతప్ప, అనుభవించి మనవద్దకు తిరిగివచ్చి మరణానంతరం మన గతి (ప్రయాణం) గురించి  చెప్పేవారుండరు.  
2

మనం మృత్యువుని రెండు రకాలుగా భావిస్తాము - కాల మృత్యువు, అకాలమృత్యువు. దేవాలయంలో తీర్థమిచ్చేటప్పుడు "అకాలమృత్యుహరణం" అని పూజారి అంటాడు. కాలమృత్యువుని తప్పించలేరు. ప్రార్థన, జపములు, సుముహూర్తములు మొదలైన వాటివలన అపమృత్యువుకు నివారణోపాయములున్నాయి. ఇప్పుడు మన వార్తాపత్రికలలో వచ్చే వార్తలన్నీ అపమృత్యువులకు సంబంధించినవే. అది ఈ కాలపు సమాజంలోని అధర్మ వర్తనకు నిదర్శనం. మనం ఆత్మ శాశ్వతమనీ, కర్మఫలంగా పునర్జన్మ వస్తుందని నమ్ముతాం. కాని  ఈ జన్మకు, రాబోయే ఉత్తరజన్మకు మధ్యయున్న ఆవరణ సామాన్యులు ఛేదింపలేనిది.  ఉత్తర జన్మను గురించిన అజ్ఞానం వలన, మనకి ఉత్తర జన్మయేలేదన్న వాదం ఒక పలాయన వాదంగా ఉపయోగిస్తుంది. మన పురాణాలలో అసురులు మృత్యువును జయించడానికి తపోమార్గాన్ని ఎన్నుకున్నారు. సాధారణంగా వారు తపస్సుచేసినది  బ్రహ్మను గురించి. మృత్యువును జయించే ఆ వరం సాధ్యం కాదని తెలిసినప్పుడు, వారు అనేక నిబంధనలతో కూడిన మరణం ఎన్నుకున్నారు.  ఈ విధంగా తమ మృత్యువును బహుకాలం వాయిదా వేయడమే వారి ఉద్దేశ్యం. అనేక సంఘటనలు కలిస్తేనే వారి మరణం సంభవిస్తుంది.  హిరణ్య కశిపుడు, రావణుడు వంటి వారలు దీనికి ఉదాహరణలు. రెండో రకం వారు యోగులు.వారు స్వచ్ఛంద మరణం వంటి విద్యలను సాధిస్తారు.  మహాభారతంలో భీష్ముడు, ఆధునిక కాలంలో త్రైలింగస్వామి దీనికి ఉదాహరణలు. కఠోపనిషత్తు ఉద్దేశ్యమేమిటి? ఋషులు ఏమిచెప్పదలచారు? మనుష్యుడు సాధించగలిగిన మృత్యుంజయత్వమేమిటో దానికి మార్గమేమిటో సూచన ప్రాయంగా ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. మృత్యుంజయత్వమంటే శరీరంలో శాశ్వతముగా ఉండడం కాదు. ఇది పరానికి సంబంధించినది. అంటే జనన మరణ చక్రం నుండి తప్పించుకునే మార్గాన్ని చెబుతుంది. మృత్యుభయాన్ని తొలగిస్తుంది. ఈ ప్రయత్నంలో సాధకుడు మార్గ మధ్యంలో మృత్యువాతబడినా, ఆ ప్రయత్నం వృథా కాదన్న ఆశ్వాసన ఇస్తుంది. నాచికేతుని పరంగా  చెప్పబడిన ఈ విద్య నచికేతవిద్య అని పిలువబడుతుంది.  
"ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మవిద్యాచార్యాయ నచికేతసే చ" నచికేతునికి బ్రహ్మవిద్యాచార్యుడైన సూర్యకుమారుడు-మృత్యుదేవతకు నమస్కారము.  అది ఉపనిషత్తు ప్రారంభం.         
3

చిరంజీవులు - మృత్యుంజయులు  = మన పురాణములలో చిరంజీవులు, మృత్యుంజయులుగా ఉన్నవారి ప్రసక్తి ఉంది. ఆంజనేయుడు చిరంజీవి.  భవిష్యత్ బ్రహ్మ అని పురాణం చెబుతుంది. అశ్వత్థామ చిరంజీవి, భవిష్యత్ వ్యాసుడని పురాణ వచనం. మార్కండేయ మహర్షి జన్మ సమయంలో ఈశ్వరుడు ఆయనకు ఇచ్చిన వయస్సు పరిమితి 16 సంవత్సరాలు. ఆ సమయం వచ్చినప్పుడు మృత్యుదేవత దర్శనం అయినది. ఈశ్వరునిపై ఆయనకు గల ప్రగాఢ విశ్వాసం, ఆయన శరణాగతి, ఆయన వయస్సును 16 సం.లోపుగా నిలిపివేశాయి. ఆయన ఆవయస్సులోనే స్థిరముగా నిలిచి చిరంజీవి అయ్యాడు. తన మృత్యువును తాను జయించాడు. తరువాత ఆఖ్యానం సావిత్రిది. ఆమె భర్తయైన సత్యవంతుడు ఆమె ఎదురుగానే క్రిందపడి మరణించాడు. అతని జీవుని కొనిపోవటానికి యముడు స్వయంగా వచ్చాడు. సావిత్రికి దర్శనం ఇచ్చాడు. యమపాశంతో సత్యవంతుని జీవుని యముడు గ్రహించడం ఆమెకు కనుపించినది. సావిత్రి తన సామాన్య నేత్రములతో యముడు తన భర్త జీవుని పాశబద్ధునిచేసి గ్రహించుట, చూచుట అసంభవము. ఆమె సహజ యోగిని అయి ఉండవచ్చును. తన శరీరము యథాస్థితిలో ఉండగానే చిత్తములో యమ దర్శనముచేసి అతనితో సంభాషించుట యోగప్రక్రియయే. ఆమె యమునితో వాదించి మూడు వరములు పొందినది. అవి లౌకికమైనవే. మామగారి చూపు, శత్రువులచే అపహరింపబడిన ఆయన రాజ్యము, మూడవది పలువురు పుత్రులు. (యముడు ఆలోచించకుండా  వరంఇచ్చాడా?) యముడు సత్యవంతుని ప్రాణాన్ని తిరిగి ఇస్తాడు. సావిత్రి ఆమెతండ్రికి  వరపుత్రిక. తాను ప్రాణంతో ఉండి యముణ్ణి చూడగలిగినది. వాదించి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకోగలిగినది. ఇది యోగమే. సావిత్రి వేరొకరి మృత్యువును జయింపగలిగినది. భగవంతుడైన శ్రీకృష్ణుడు గురుదక్షిణగా కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన సాందీపని కుమారుని ప్రాణాలు తిరిగితీసుకొని రావడం మూడవ కథ. కఠోపనిషత్తులోని నచికేతసునిది అందరికంటె విలక్షణమైనది. అందరికీ అవసరమైన మృత్యుంజయత్వ సాధనావిధానాన్ని మృత్యుదేవత నుండే గ్రహించి ఈ జగత్తుకు ఇచ్చాడు.  మనకు గురుతుల్యుడు.     
ఆధునిక కాలంలో కొందరు యోగులు శరీరమునుండి కొంత సమయము బయటకు వచ్చిన అనుభవమును (O.B.E. Out of body experience) వర్ణించారు. రమణ మహర్షికి ఒకరోజు తాను మరణిస్తున్న భావము కలిగినది. ఆత్మ శరీరమునుండి బయటకు వచ్చి, తన దేహమును తాను చూచుకొని ఆత్మ శరీరమునుండివేరని తెలుసుకున్నది. ఆ శరీరమును దహనము చేసినను, అది తనను బాధించదని, తాను శరీరమునుండి వేరు వస్తువని మహర్షి తెలుసుకొనిరి.  షిర్డి సాయిబాబా ఆత్మ మూడు రోజులు శరీరమును వదలిన అనుభవము ఆయన చరిత్రలో ఉన్నది. ఇవి చాల ప్రత్యేకమైన అనుభవాలు;   తమ పూర్వ జన్మ సాధనల వలన ఆయా జీవులకు అనుభవమైన విషయాలు. ఇవి అన్యులకు అనుభవంలోనికి రావు.  

4
భగవద్గీత అనేక మోక్షమార్గాలను తెలిపినది. తీవ్రమైన మోక్షేచ్ఛతో  సాధన ప్రారంభించిన మానవుడు మధ్యేమార్గంలో మృత్యువాత పడితే అతని సాధన గతి ఏమిటి? పునర్జన్మ అతని కర్మఫలంగా వస్తుంది. ఆ నూతన జన్మలోరాబోయే పరిస్థితులపై అతనికి నియంత్రణ ఉండదు. మోక్షమునకై ఇచ్ఛ ఉంటుందో, ఏస్థాయిలో ఉంటుందోకూడా తెలియదు. పూర్వజన్మ వాసనలు సంస్కారములరూపంలో ఉండవచ్చును. అందుచేత మృత్యువు పరానికి సంబంధించినంతవరకూ ప్రమాదకారియే.
ఉదాహరణకు సుబ్బారావు అనే వ్యక్తి మరణించాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతని ఆత్మ ఇంకొక ఊరిలోని ఇంకొక కుటుంబంలో  సురేశ్‌ గా పునర్జన్మ ఎత్తినదనుకోండి.  ఇది ఆత్మకు దీర్ఘకాల ప్రయాణము. జీవులు మానవదేహములలో ఉండే కాలము కంటె దేహములో ఉండని కాలమే ఎక్కువ. అందుకే మానవ  జన్మ దుర్లభము అంటారు. దేహములోలేని కాలము జీవునకు దుర్భరమైన దీనావస్థ.  సుబ్బారావు దేహము ధరించిన జీవుని ప్రయాణం (అతని మరణం నుండి, సురేశ్ తల్లి గర్భంవరకూ) గురించి ఎవరు చెప్పగలరు? (యముడు తప్పక చెప్పగలడు. ఎందుకంటే యాతనాశరీరం ధరించిన ప్రేతాత్మ యమలోకంవెళ్ళి, అక్కడ యముని నిర్ణయంతో స్వర్గ, నరకవాసాల కాలము నిర్ణయింపబడుతుంది కనుక).
సుబ్బారావు పుణ్యపాపాలు సురేశ్ ప్రారబ్ధకర్మగా ఎలా పరిణమిస్తాయి? సుబ్బారావు దేహాన్ని వదలిన సూక్ష్మశరీరం ఎంతవరకు తన పూర్వజన్మస్మృతిని కలిగిఉంటుంది? ఆత్మ శాశ్వతమంటే నూతన దేహంలో ఆ జీవుని మొదటి దేహానికి సంబంధించిన అహంకార పూరిత వ్యక్తిత్వం కాదు కదా! ప్రతిజన్మలోనూ జీవాహంకారం వేరుగా ఉంటుంది. మృత్యుంజయత్వమంటే అర్థంఏమిటి? ముక్తి ఎవరికి?   మొదటి జన్మలోని సుబ్బారావు అనే వ్యక్తికా? రెండో జన్మలోని సుబ్బారావు ఆత్మ ప్రవేశించిన సురేశ్‌ అనే వ్యక్తికా? మరణం సుబ్బారావు దేహానికైతే, సుబ్బారావు ఆత్మ, అతని జీవాహంకారంతో నిలిచి ఉంటుందా? జీవాహంకారం నశించినతరువాత అదే ఆత్మ ఇంకొక శరీరం ధరిస్తుందా?  గర్భస్థ శిశువులో జీవాత్మ ఉంటుంది కాని అహంకారం ఉండదు. జననం, తరువాత నామకరణం తోనే అహంకారం పెరగడం ప్రారంభిస్తుంది. అంటే పుట్టినసమయం ఆధారంగా చెప్పే జాతకం ఆత్మకు కాదు, అహంకారానికి అన్నమాట.   సుబ్బారావుకు తొలి జన్మలోకలిగిన మోక్షముపై ఇచ్ఛ, రెండవ జన్మయైన సురేశ్‌లో ఎంతవరకు నిలిచిఉంటుంది? సుబ్బారావు మరణం ఎక్కడైనా ఎప్పుడైనా సంభవించియుండవచ్చును. అతని మరణానుభవం,  పునర్జన్మ గురించిన వివరాలు, సురేశ్‌ తో సహా ఇతరులు తెలుసుకోలేని అనుభవాలు.  సుబ్బారావు  దైహిక బంధాలు - భార్య, పిల్లలు, ధనం, గృహం, కీర్తి, మేధస్సు - అతని మరణంతో దేహముతోబాటుగా  పోతాయి. అవి సురేశ్‌కు ఏవిధంగాను ఉపకరించవు. అతని పుణ్య పాపాలు కర్మ ఫలాలుగా సురేశ్ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అది అతని విధివ్రాత! సామాన్యునిగా దానిని అర్థంచేసుకోలేడు, అధిగమించలేడు. జ్యోతిష శాస్త్రం కొంతవరకు దీనిని గుర్తించే ప్రయత్నంచేస్తుంది. వాటి వలన అతని పరానికి ఏ విధమైన ఉపయోగము లేదు. సురేశ్ ఆధ్యాత్మికంగా ఏస్థితిలో ఉంటాడు? ప్రతి మరణం కర్మానుగుణంగా ఒక కొత్తవ్యక్తిని సృష్టిస్తుందా?   
సద్గురు శివానంద మూర్తిగారు ఈ పరిస్థితిని పరమపద సోపాన పటము (వైకుంఠపాళి)లోని  పాములు నిచ్చెనల ఆట తో (Old Hindu version of Snakes and Ladders) పోలుస్తారు. అల్ప సాధనలు చిన్న చిన్నపుణ్యాల నిచ్చెనలను ఎక్కిస్తే, మృత్యువు పెద్దపాముకు చిక్కినట్లు, కర్మానుసారముగా జీవుని స్థితిని ప్రారంభ దశకు (back to square one) తీసుకొని వస్తున్నది. జీవుడు మరల భిన్నమార్గాన్వేషణకు దిగుతున్నాడు. మరణము అల్ప సాధకుని సాధన సంపత్తిని హరించుచున్నది.
5

వాజశ్రవసుడు అనే ఋషి ఉండేవాడు. ఆయనకు ఆరుణి (అరుణ మహర్షి కుమారుడు), ఔద్దాలకుడు (ఉద్దాలక మహర్షిచేత పెంచబడిన వాడు)అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన ఉత్తమలోకములనిచ్చే ఒక గొప్పయాగం (విశ్వజిద్యాగము) చేశాడు. ఆయాగంలో భాగంగా తనకున్న సంపద నంతా ( గోసంపద) దానం చేశాడు. ఆయన ధనాదుల త్యాగమే కాక యాగఫల త్యాగం కూడా చేశాడు. ఆయనకు ఒక కుమారుడు. చిన్నవాడు.  పేరు నచికేతసుడు.
కుమారుడు అంటే ఎంత వయస్సు ఉంటుంది? వీటి సమాధానాలు ఉపనిషత్తులో ఉండవు. సందర్భోచితంగా మనం ఊహించుకోవాలి. అతడు అడిగిన ప్రశ్నలనుబట్టి, కుమార అన్న పద ప్రయోగమును పట్టి, అతనికి శ్రద్ధ ఆవహించినదన్న వాక్యాన్నిబట్టి అతడు కౌమారావస్థలో 14-15 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడని అనుకోవచ్చు. "తండ్రీ! ఇంత యజ్ఞంచేశావు? ఇన్ని దానాలు ఇచ్చావు, మరి నన్ను ఎవరికి ఇస్తావు?" అని తండ్రిని అడిగాడు. 9సంవత్సరాలకే ఉపనయనం జరిగి, మరో ఐదారు సంవత్సరాల వేదాధ్యయనం చేసిఉండవచ్చు. తద్వారా కలిగిన శ్రద్ధతో తండ్రిచేస్తున్న యాగం గురించిన ప్రశ్నలు వచ్చాయి. తండ్రి యజ్ఞఫలంగా ఉత్తమలోకాలకు తక్షణం వెళ్ళిపోతే  తనగతి ఏమిటన్న భయం ఉండవచ్చు. ఎవరైనా ఋషికి తనను దానమిచ్చి తనకు జ్ఞాన మార్గమును చూపించ వచ్చు. ఈ ఆలోచనలతో వచ్చిన వివేకంతో ఆప్రశ్న అడిగినట్లు తోస్తుంది. ఇంత యజ్ఞంచేశాక తండ్రి భవిష్యత్తు ఏమిటి? తండ్రి వెంటనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడా?  అప్పుడు తన భవిష్యత్తు ఏమిటి?   
తరువాత మంత్రములో గోదానమును గురించిన ప్రశ్న వస్తుంది. "నీ గోధనమంతా దానం ఇచ్చావుకదా. దానిలో గడ్డితినలేనివి, నీరు త్రాగనివి,  గర్భధారణచేయలేనివి, అంతిమకాలంలో ఉన్నవీ ఉన్నాయికదా. వాటిని దానంచేయడం వలన దోషం వస్తుందేమో?" ఇది కుమారునికి వచ్చిన అనుమానమో, ఆ మాటలు ప్రకాశముగా అన్నాడో,  లేదో కూడా తెలియదు. తండ్రినుండి సమాధానంలేక పోవడం వలన "నన్ను ఎవరికిస్తావు? నన్ను ఎవరికి ఇస్తావు" అని రెండోసారి, మూడవ సారి  కూడా నచికేతుడు అడుగుతాడు. "మృత్యవే త్వాదదామి ఇతి". "నిన్ను మృత్యువుకు ఇస్తాను"  అన్నాడు తండ్రి.    

6

అర్థం కాలేదు నచికేతసునికి. తండ్రి ఏ ఉద్దేశ్యముతో తనని మృత్యుదేవత యైన యమునికి ఇస్తానన్నాడు? అది తాను మూడు సార్లు అడగడం వలన కోపంతో అన్నాడా? యమునికి ఈయడంలో అర్థం ఏమిటి? నన్ను తీసుకున్న యముని కర్తవ్యం ఏమిటి? నేను ఆయనకు ఎలా ఉపయోగిస్తాను? నేనుకూడా నిరుపయోగమైన ఆవు వంటివాడినా? ఇలాంటి అనుమానాలు వచ్చాయని అనుకోవచ్చు. "బహునామేమి ప్రధమో, బహునామేమి మధ్యమః" ఇక్కడనేను అనేకులలో ప్రధమునిగా లేక మధ్యమునిగా ఉన్నాను. అందుచేత నా తండ్రికి నామీద కోపంఉండే అవకాశంలేదు. రైతు పైరును పెంచి, పంట కోసుకుంటాడు. యముడు కూడా అంతే. మనుష్యుడు పెరిగి మృత్యువాత పడతాడు. ఇప్పుడు తనగతి అంతేనా? తండ్రి తనను మృత్యువుకు ఇస్తాను, అంటే దాని అర్థమేమిటి? మానవుని అనిత్యత్వము నచికేతునికి తండ్రిమాట విన్నాక అవగతమైనది.    
 వైశ్వానరః ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్ 
తస్మైతాగ్ం శాంతింకుర్వంతి హరవైవస్వతోదకం   (క. ఉ. 1.7)

నచికేతనుణ్ణి మొదటపుత్రుడని, తరువాత కుమారుడనీ ఇప్పుడు బ్రాహ్మణుడనీ వ్యవహరిస్తున్నాడు. బ్రాహ్మణుడు వైశ్వానరుడై (అగ్ని రూపంగా) యమసదనం లోనికి ప్రవేశించాడు. "వైవస్వతా (సూర్యునికుమారుడైన యముడా!) నీటిని తెమ్ము" ఇది నచికేతనుడే అడిగి ఉండవచ్చు. 
యమలోకంలోని యముని గృహానికి నచికేతుడు ఎలా వెళ్ళాడు? అతిథిగా వెళ్ళాడంటే అతడు మరణించలేదని అర్థం. మరణించిన వారు యమలోకానికి అతిథులు కాదు. వారి ప్రేతాత్మలు అక్కడికి తీసుకురాబడతాయి. ఉదకములు ఎందుకు అడిగాడు? యోగ రహస్యమంతా ఈ మంత్రములోనే ఉన్నది.
బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానమును గురించిన జిజ్ఞాస కలవాడు.  నచికేతుడు వాజశ్రవసుని పుత్రుడుగా యమలోకానికి రాలేదు. తండ్రిని తన భవిష్యత్తు గురించి ప్రశ్నించి, తనకు తానుగా యముని వద్దకు జ్ఞానార్థిగా వచ్చాడు.  నచికేతుడు అగ్ని రూపముగా వచ్చాడు అంటే భూమితత్త్వంగల భౌతికరూపంతోరాలేదు. భౌతికశరీరంతో ఊర్ధ్వలోకాలకు ఎవరూ రాలేరు. ఎలా వచ్చాడో వివరించాలంటే చాలా పారిభాషిక పదజాలం కావాలి.    
"ఆశా ప్రతీక్షే ... యస్య అనశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే" అంటే ఎవరింటికి గృహస్థుడు ఆదరిస్తాడన్న ఆశతో వచ్చిన ఒక బ్రాహ్మణుడు భోజనంచేయకుండా ఉంటాడో, ఆ గృహస్థు పుణ్యసంపద అంటా ఆ అతిథికి పోతుంది. అతిథిసేవ చేయని వానికి పుణ్యలేశము కూడా మిగలదు. ఈ మాటలు యముడే అంటాడని తరువాత మంత్రంతో తెలుస్తుంది. యముడు అంటాడు – “ఓబ్రాహ్మణుడా, నీకు నమస్కారము, నాకు స్వస్తి అగుగాక, నీవు నాఇంట మూడు రాత్రులు భోజనములేకుండ ఉంటివి. దానికి బదులుగా మూడు వరములు అడుగుము” (క. ఉ. 1.8, 1.9). ఉపనిషత్తు ప్రథమ వల్లిలోని ఈ మూడు శ్లోకములకే ఎంతో విశ్లేషణ, వివరణ అవసరమౌతాయి.   


No comments:

Post a Comment