Pages

Saturday, 22 June 2013

కఠోపనిషత్ - 3 (Retold from Katha Yoga of Sadguru Sivananda Murty garu)


13
ఇప్పుడు రెండో వరములో యముడుచెప్పిన యోగాగ్ని రహస్యము ఇట్లు చెప్పవచ్చును.  మూలాధారము భూతత్త్వము. స్వాధిష్ఠానము అగ్నితత్త్వము. మణిపూరకము యోగి నాభి స్థానమునందున్నది. అది అగ్ని,జలముల మిశ్రమ తత్త్వము. కుండలినిని జాగృతముచేసి స్వాధిష్ఠాన, మణిపూరకములలో అగ్నితత్త్వములో ప్రవేశించి  ప్రయత్నపూర్వకముగా కంఠమందలి విశుద్ధచక్రమును జేరి, యోగముచేత ప్రాణసహితమైన శరీరమును వదలి, యోగి సుషుమ్నానాడి ద్వారా ఊర్ధ్వలోక సంచారమునకు, తన జీవునిగా వెళ్ళగలడు. లేదా తనకు కావలసినప్పుడు ఇడా, పింగళా నాడుల ద్వారా దేహమును విసర్జింపగలడు. స్వచ్ఛంద మరణమనగా నిదియే. జీవించి యుండగా స్వర్గాదిలోకములకు వెళ్ళు మార్గమిదియే. భౌతికలోకములకు ఆధారమైన అగ్నిని, ఇటుకలను పేర్చిచేసిన హోమకుండమును  ఏర్పాటుచేసి యజించు బాహ్యయజ్ఞమును కూడా నచికేతసునికి యముడు వివరించాడు.
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
అస్తీత్యేకే నాయమస్తీతి చైకే
ఏదైతే మనుష్యునియందు ఉన్నదో, అది చనిపోయినపుడు ఏమౌతున్నదో నాకు సందేహమున్నది. కొందరు ఏదో ఉన్నదని అంటున్నారు. కొందరు ఏమీలేదంటున్నారు. 
ఏతద్విద్యా మనుశిష్టస్త్వయాహం
వరాణా మేష వరస్తృతీయః (1.20)
ఈ విషయాన్ని నీవలన బోధింపబడి  నేను తెలుసుకోగోరుచున్నాను. ఇది నచికేతసుడు అడిగిన  మూడో వరం. తన వయస్సుకు తగినట్లు, అమాయకంగా అడిగినట్లున్న ప్రశ్న ఇది. ప్రాణము, జీవుడు ఇలాంటి పరిభాష వాడలేదు. చనిపోయినప్పుడు ఏమవుతుంది? స్వర్గానికి వెళ్ళేవాడు ఎవరు? నరకంలో కష్టపడేది ఎవరు? పాప పుణ్యాలు చేసింది ఎవరు? సుఖ దుఃఖాలు పొందేది ఎవరు?  స్వర్గంలోకి ఏదివెడుతుందో దానికి శరీరము, తాను శరీరముతో చేసిన కర్మలూ గుర్తు లేక పోతే, ఎవరి పాపానికి, ఎవరు శిక్షింపబడుతున్నారు? ఇలాంటి సందేహాలన్నీ నచికేతసుడి ప్రశ్నలో  ఉన్నాయి.   
నచికేతునికి తన చిత్తభావనల అనుస్యూతి (continuity of consciousness) ఉండుటవలననే ఈ ప్రశ్న అడుగగలుగుతున్నాడు కదా? ఈ అనుమానం రావచ్చును. తాను మరణించి యమలోకానికి రాలేదు. తన తండ్రి తపశ్శక్తి ప్రభావం వలన, ఆయన మాటతోనే తాను రాగలిగాడు.అందుకే మొదటివరంలో స్వయం శక్తితో ఊర్ద్వలోకానికి వెళ్ళి, తిరిగి రావడం గురించి అడిగాడు. ముక్తి వేరు, మరణం వేరు. ముక్తి అంటే బంధన విముక్తి. అది శరీరంలో ఉండగనే రావచ్చును. అతడు అడుగుతున్నది సామాన్యుల మరణానంతర స్థితి.    (ఇడా, పింగళ, సుషుమ్న అనే నాడులు షట్చక్రములను  పరివేష్టించి ఉంటాయి. ఇవి కూడాస్థూల శరీరములో కనుపించేవి కాదు. సామాన్యంగా నాడి అంటే nerve అనే పదానికి బదులుగా వాడతాము. కాని ఇక్కడ channels or ducts, ప్రాణ శక్తి నాళములు అనుకోవచ్చును. కుడివైపున ఉన్న పింగళ ద్వారా ప్రాణము విడువడం సూర్యమండలం ద్వారా ఊర్ధ్వలోకాలకు వెళ్ళే మార్గం. ఎడమవైపున ఉన్న ఇడా నాడి చంద్రమండలము ద్వారా పితృలోకానికి వెళ్ళి పునర్జమ పొందే మార్గం. నాచికేత విద్య సాధకునికి పునర్జన్మ రహితమైన దేవమార్గాన్ని ఈయగలదు. మధ్యన ఉన్న సుషుమ్న తాత్కాలిక లోక సంచారానికి మార్గము.)
14
నచికేతసుని మూడవ వరానికి యముని సమాధానం ఇలా ఉంది.
దేవైరత్రాపి విచికిత్సితం పురా
నవి సువిజ్ఞేయమణురేషు ధర్మః
పూర్వమునుండి దేవలోకవాసులకు కూడా  ఈవిషయంలో సందేహమున్నది. ఇది అణువు వలె సూక్ష్మమైనది. సులభంగా తెలుసుకొనలేనిది.
అన్యవరం నచికేతో వృణీష్వ
మామోపరిత్సోరతి మాసృజైనమ్ (1.21)
అందుచేత ఇతర వరమేదైనా కోరుకొనుము. నన్ను ఈవిషయములో బలవంతముచేసి,  మోమోటపెట్టకు. 
ఇక్కడ దేవలోక వాసులకు అంటే ఇంద్రాది దేవతలకు అని అనుమానం రావచ్చును. పుణ్యంవలన మరణానంతరం దివ్యశరీరాలు ధరించి స్వర్గానికి  కొంతకాలం వచ్చేవారు అధికులు. వారికి అక్కడ ఉన్న కాలంలో జరా మృత్యువులు, ఆకలిదప్పులు, భయము ఉండవు. ఆందోళన ఉంటే సుఖానుభవం ఉండదు. స్వర్గ సౌఖ్యములు అనుభవించే కాలంలో వారికి తరువాత రాబోయే స్థితిని గురించితెలియదు, తెలుసుకోరు. ఇటువంటి ధర్మములు సూక్ష్మముగా ఉంటాయి. సులభముగా గ్రాహ్యముకావు. వాగ్దానముచేసిన తనను ఒత్తిడి చేయక మరొక వరము కోరుకొనుము అని యముడు నచికేతసునికి చెబుతాడు.  
నచికేతసుని వాదం. "యమదేవా! ఇది దేవలోక వాసులచేత కూడా సందేహింపబడినది, సులభముగా గ్రాహ్యము కాదు అంటే, దాని ప్రత్యేకత బోధపడుతుంది. ఇది చెప్పటానికి నాకు మీకంటె సమర్థులైన బోధకులు ఎక్కడ దొరకుతారు?  చనిపోయిన తరువాత జీవులగతి నీ అధీనములోనే ఉంటుంది కదా? అందుచేత నీద్వారా తెలుసుకుంటేనే నేను ఈవిషయమై పరిపూర్ణ జ్ఞానం పొందగలను. అందుచేత దయ యుంచి నేను అడిగిన వరమే నాకు ప్రసాదింపుము."  
యముని పలుకులు  ---
శతాయుషః పుత్రపౌత్రాన్వృణీష్వ
బహూన్‌పశూన్‌హస్తి హిరణ్యమశ్వాన్
భూమేర్మహదాయతనం వృణీష్వ
స్వయం చ జీవశరదో యావ దిచ్ఛసి  (1.23)

“నూరేండ్లు జీవించుము. పుత్రపౌత్రులను కోరుకొనుము. ఆవులు, ఏనుగులు, అశ్వాలు, బంగారములను కోరుకొనుము. విశాలమైన భూమిని కోరుకొనుము. నీవు కోరుకున్నంత ఆయుర్దాయము కలిగి ఉండుము.   ఇంకా నీకు కావలసినవన్నీ అడుగుము. ధనమును  కోరుకొనుము. రాజ్యము కోరుకొనుము.   దీనికి తుల్యమైన ఏవరమునైనను కోరుకొనుము. ఇంకనూ మిగిలిన కోరికలన్నీ కోరుకొనుము.” అని యముడు అడుగుతూ ఇంకా ఇలా చెబుతాడు. “నీవు భూమికి తిరిగి వెళ్ళుతున్నావు. నశించే మర్త్యలోకములో వార్ధక్యం రాకముందే తీర్చుకోలేని కోరికలు ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ మరచి మృత్యువు తరువాత గతిని ఎందుకు అడుగుతావు?  మానవులందరూ కోరుకునే ఐశ్వర్యం, సుందరమైన స్త్రీలు, పరిచారికలు, ఇవన్నీ అడుగకుండా చిన్న వయస్సులో ఈ మరణం గురించిన ప్రశ్న ఎందుకు వేస్తావు?”    

నచికేతసుడంటున్నాడు: "మానవ శరీరాలు నశించేవి. నీ వలననే పడిపోతున్నాయి. నీవిస్తానన్న భోగాలు ఆయుర్దాయాన్ని క్షీణింపజేస్తున్నాయి. వార్థక్యాన్ని తెస్తున్నాయి. పూర్ణజీవితకాలం కూడా అల్పమైనదే. దేవతలు ఇచ్చేవరాలన్నీ ఇక్కడి అశాశ్వతమైన సంపదలే. పైలోకాలలో స్థితిని వారు ఈయటంలేదు.  నశించేవి సంపాదించుకొని ఏమి లాభం? వరాలు తృప్తిని ఈయవు. దేవతయైన నిన్ను చూడటానికి మించిన ఐశ్వర్యమేముంది? నేను కోరుకున్న వరమే  నాకు తగినది"   
15

యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో
యత్సంపరాయే మహతి బ్రూహి నస్తత్
ఓ మృత్యుదేవతవైన యమా! శరీరధారణము, పతనము తరువాత ఏమి ఉన్నదో, దేనినిగురించి దేవతలకు కూడా సందేహములున్నవో, అట్టిదానిని గురించి నాకు చెప్పుము.
యో2యంవరో గూఢమనుప్రవిష్టో 
నాన్యం తస్మాన్నచికేతా వృణీతే  (1.29)
ఈ నిగూఢమైన విషయములో ప్రవేశించిన నచికేతసుడైన నేను మరియే అన్యవరమూ నిన్ను కోరను.   యమునికి ఇప్పుడు తప్పనిసరిగా నచికేతసుడు అడిగిన మూడవ వరము ఈయవలసి వచ్చినది. నచికేతసునికి పూర్తిగా వైరాగ్యం వచ్చినదా, లేక ఇంకా భూలోకములోని జీవుల కోరికలున్నవా అని యముడు పరీక్షించాడు. పరీక్షలో ఉత్తీర్ణుడైన నచికేతసునికి జీవాత్మ రహస్యము బోధించాడు. సామాన్యులు దేవతా దర్శనమయ్యాక ఏకోరికలు కోరుకుంటారో వాటినన్నిటినీ నచికేతసుడు తిరస్కరించాడు.  
జీవుడు మనుష్య శరీరాన్ని ధరించి ఉండగానే జీవన్ముక్తుడు కావడానికి  మార్గమును ఉపదేశించడం ఈ ఉపనిషత్తు ప్రధాన లక్ష్యం. యముడు ఇచ్చిన మొదటివరం లౌకికమే. నచికేతసుడు సజీవంగా తండ్రిని చేరి ఆయనకు ఆనందం కలిగించడమే ఆ వరం ఉద్దేశ్యం. రెండవ వరంలో ఇచ్చినది శాశ్వత ఊర్ధ్వలోక నివాసం తప్ప మోక్షము కాదు. మూడవ వరంలో నచికేతసుడు అడిగినది జీవాత్మ రహస్యం, తద్వారా పరమాత్మ రహస్యం.  జీవాత్మ,పరమాత్మల సంబంధం, నిత్యానిత్య వివేకం వంటి పారిభాషిక పదాలు వాడకుండా చిన్నపిల్లాడి వలెనే అసలు ప్రశ్న అడిగాడు. చిన్న పిల్లవాడిని ప్రలోభ పెట్టినట్లే యముడు కూడా చిన్న చిన్న ఆశలు కలిగించాడు.  ఆత్మవిద్యకు కావలసిన వైరాగ్యము, వివేకము, శమ దమాది గుణసంపత్తి,  ముముక్షత్వము, పరిపక్వ స్థితి ఉన్నాయని నిశ్చయం చేసుకున్నాకే నచికేతసునికి యముడు ఆత్మవిద్యను బోధింఛాడు.  
మూడవ వరములొ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి, మృత్యుంజయత్వాన్ని ప్రసాదించే నచికేతవిద్య లోని యోగసాధనా రహస్యము ఏమిటి? దీనికి సమాధానం ద్వితీయవల్లిలో దొరుకుతుంది.
16
ద్వితీయవల్లి          
కఠోపనిషత్తులో అధ్యాయాలని వల్లి అంటారు. రామాయణములో కాండము,  మహాభారతములో పర్వము, భాగవతములో స్కంధము అనే పేర్లు సుపరిచితములే.  వల్లి అంటే లత. అనేక పుష్పములతో, మధుర ఫలములతో, అన్నివైపులా వ్యాపించి జ్ఞాన ఫలాలను ఇస్తుంది. అంతిమఫలం మోక్షం. హృదయాకాశం,నచికేతాగ్ని అనేపదాలతో, యాగం, యోగం అనే రెండు సనాతన ధర్మములోని అంగాలను ప్రథమవల్లి సమన్వయంచేసింది. నచికేతాగ్ని విద్య మృత్యుంజయత్వాన్ని ఇస్తుంది. ద్వితీయవల్లిలో చెప్పబడిన మోక్షవిద్య దీనికి తరువాతది.  మనం షట్చక్రాలలో  మూలాధార చక్రం గురించి చెప్పుకున్నాము. వెన్నెముకకు అడుగున ఉన్న చక్రమే ఇది. యోగసాధన ఈ చక్రంలో స్థితి కలిగియున్న గణపతి ఉపాసనతో ప్రారంభమౌతుంది. గర్భస్థ శిశువు పెరుగుదల, శరీరనిర్మాణము ఇక్కడనుండే ప్రారంభం అవుతాయి. పూర్వజన్మ కర్మలకు అనుగుణమైన  సంస్కారములతో  ఈ మూలాధార పద్మం చుట్టూ శరీర నిర్మాణము జరుగుతుంది. జీవుడు తల్లిగర్భంలో ఈ స్థానంలోనే ప్రవేశిస్తాడు. శరీరపు పెరుగుదలతో మిగిలిన చక్రాలు ఏర్పడతాయి.  
మొదలుగా విశ్వవ్యాప్తమైన జలాలతో గర్భస్త శిశువులో  ప్రాణ శక్తి వస్తుంది.జంతువులలో సామాన్యం గా మూలాధారం, కొన్నిటిలో స్వాధిష్ఠానం వరకు మాత్రమే ఉంటాయని పెద్దలు చెబుతారు.  మూలాధారం  నాలుగు దళాల పద్మం. బీజాక్షరాలు వం, శం,షం, సం. తూర్పుదిక్కుకు తిరిగి పద్మాసనంలో యోగ సాధన చేసేవ్యక్తికి తూర్పు దిశలో వం, దక్షిణాన శం, పశ్చిమాన షం, ఉత్తరాన సం ఉంటాయి. సం మృత్యువుకు, వం అమృతానికి సంకేతం. జననం, మృత్యువు మధ్య సంబంధాన్ని ఈ చక్రం సూచిస్తుంది. సాధనా విశేషాలు గురువు ద్వారానే లభిస్తాయి. ఈ చక్రంపై సాధన దీర్ఘాయువునిస్తుంది. ఇది మొదటి వల్లి బోధ.
  అన్యచ్చ్రేయో2న్యద్యుతైవ ప్రేయ
స్తేఉభే నానార్థే పురుషగ్ం సినీతః
తయోశ్శ్రేయ ఆదదానస్య సాధు
భవతి హీయతే2 ర్ధద్య ఉ ప్రేయోవృణితే (2.1) 
ప్రపంచంలో శ్రేయస్సు, ప్రేయస్సు అనిరెండు ఉంటాయి. మనం శ్రేయోభిలాషులు అనుకునేవారు నిజానికి ప్రేయోభిలాషులు. నశించే లక్షణముగల అష్టైశ్వర్యములు, పుత్రాదులు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము. శ్రేయస్సుకోరుకునేవారు ఉత్తములు. వీటినే ప్రవృత్తి , నివృత్తి మార్గములంటున్నాము.   
17
ప్రథమ వల్లిలో నచికేతసుడు తండ్రి సంతోషముకొరకు తాను పునః భూలోకానికి వెళ్ళే మొదటివరము, యోగసాధనలో తనకు దీర్ఘాయువును ప్రసాందించగలిగే నచికేతాగ్ని గురించిన రెండవ వరములతోబాటు ఆత్మ జ్ఞానమును, మృత్యురహస్యమును తెలియజేసే ఆత్మవిద్యను తృతీయవరముగా కోరి దానిని సంపాదించగల అర్హతను నిరూపించుకున్నాడు. దానికి సంతోషించిన ధర్మదేవత, ద్వితీయవల్లిలో, అతనికి మొదట జీవుని కోరికలలో శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉన్నాయని చెబుతాడు. కర్మలచేత స్వర్గాది సౌఖ్యములు కోరువారు, వానిని పొందిన వారుకూడా మోక్షమార్గము విషయములో దారి తప్పిన వారే అని చెబుతాడు. కేవలము నచికేతాగ్నిని ఉపాసించడంవలననే సంపదలు, సౌఖ్యములు ఈ భూమిమీదే అనుభవిస్తాడనీ, వానిని తిరస్కరించడమే వివేకమనీ చెబుతాడు.  
ప్రపంచంలో కొంత చదువు, సంస్కారము, జ్ఞానము ఉన్నవానిని కూడా స్వర్గ సౌఖ్యములే ఆకర్షిస్తున్నాయి కనుక వారు కూడా దారి తప్పినవారే అవుతున్నారు. జీవుడు ప్రేయస్సు అంటే కర్మఫలాల చేతనే ఆకర్షింపబడుతున్నాడు. భగవద్గీతలో భగవానుడు  "యోగక్షేమం వహామ్యహం" అని ఆశ్వాసన ఇస్తాడు. లోకస్థితిలో ముందుకావలసినది క్షేమము. అంటే ఉన్నది రక్షింపబడడమే. కీర్తి ప్రతిష్ఠలు, సంతానం, సంపదలు చిరస్థాయిగా ఉండడమే క్షేమము. ఇది ప్రేయస్సులోని మొదటిమెట్టు. లేనివి రావడం, అంటే లేనివానిని కోరుకోవడం యోగం (ధనయోగం, వాహన యోగం, రాజయోగం). లేమి జీవులకు దుఃఖ కారణం. ఇలా అర్థంచేసుకుంటే యోగక్షేమములే ప్రేయస్సు. ఇది సామాన్యార్థం.
 అనన్యాశ్చింతయంతోమాం యేజనాః పర్యుపాసతే  
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.(భ.గీ.)
"అన్యచింతలేకుండా అన్నిటినీ వదలిపెట్టి నన్ను మాత్రమే ఉపాసించినవాని యోగక్షేమములు నేను వహిస్తాను" అని భగవానుడుచెప్పినప్పుడు సామాన్యమైన అర్థము వర్తించదు. అక్కడ యోగక్షేమములంటే శ్రేయస్సు నిచ్చేవి, పరమమైన స్థితికి తీసుకొని వెళ్ళేవి. అనన్య చింతన అనే యోగమునకు క్షేమము, అనగా మృతిలేని ముక్తి మార్గమునందు సుస్థిరుని చేస్తానని భావము.     
శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత
స్తౌ సంపరీత్య వివినక్తి ధీరాః
శ్రేయో హి ధీరో2భి ప్రేయసో వృణీతే
ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే  (2.2)  
శ్రేయస్సును, ప్రేయస్సును బాగావిచక్షణచేసిన వివేకియైన ధీరుడు శ్రేయస్సునే వరిస్తాడు. మందబుద్ధి కలవాడు లౌకికమైన యోగక్షేమములను వరించును.     
18
ఈ ద్వితీయ వల్లిలో శ్రేయస్సు,ప్రేయస్సులను గురించిన సంభాషణ అంతా యమునిది. యముడు ఇంకా ఇలా చెబుతున్నాడు.
"స త్వం ప్రియాన్ప్రియ రూపాగ్ంశ్చ కామా
నభిధ్యాన్నచికేతో  2త్యస్రాక్షీః
వైతాగ్ం సృంకాం విత్తమయీ మవాప్తో
యస్యాం మజ్జన్తి బహవోమనుష్యాః  (2.3)
నచికేతా! నీవు ధీరుడవై ప్రియమైన వానిని, ప్రియమైన రూపము గల వానిని విచక్షణతో త్యజించావు.  లోకములో అనేక మనుష్యులు ప్రియమైన వస్తువులు, సుఖాసంతోషాల ధ్యాసలో మునిగిపోతున్నారు (మజ్జన్తి). నీవు సంపదలనే వలలో పడలేదు. ఈ విధంగా గురుస్థానంలోనున్న యమధర్మరాజు నచికేతసుణ్ణి ప్రశంసించాడు. దాని అర్థం "నీవు నశించే సంపదలనుకోరక బ్రహ్మ విద్యకు ఉత్తమాధికారివి అయ్యావు." ఇది యముని భావం.
దూరమేతే విపరీతే విషూచీ
అవిద్యాయా చ విద్యేతి జ్ఞాతా
విద్యాభీప్సినం నచికేతసం మన్వే
న త్వా కామా బహవో2లోలుపంత
విద్య, అవిద్య అని రెండున్నాయి. వాటి మధ్య చాలా దూరం (విషూచీ). అనేక మోహములు, కామములు నీకూ ప్రలోభము కలిగించలేదు.నచికితేసా!నీవు సత్యమైన జ్ఞానార్థివే.  యముని ఉద్దేశ్యం "నచికేతస! నీవు సామాన్యులవలె కాదు, అందుచేత నీకు చెప్పేది శ్రద్ధగా స్వీకరించు” అని గుర్తుచేయడమే.   
దీని అర్థం మనుష్యులలో విద్య, అవిద్య రెండూ ఉంటాయని కాదు. కేవలమూ అవిద్యయే ఉంటుంది. ముక్తిని కోరేవాడయితే అవిద్యకు అంచున ఉంటాడు. విద్య, అవిద్య పరస్పరవిముఖమైన దిశలలో ఉంటాయి. అవిద్య అనబడే లౌకిక సుఖలాలస అంతరించడమే ముముక్షత్వం. సాధకుడు విద్యను కోరుకొనేవాడు. ఆ విద్యను   జయించినవాడు సిద్ధుడు.  
అవిద్యాయామన్తరే వర్తమానాః  
స్వయం ధీరాః పండితం మన్యమానాః  
దంద్రమ్యమాణాః పరియన్తి మూఢాః    
అంధేనైవ నీయమాన యథంధాః  (2.5)

అవిద్యలో జీవిస్తూ, తాము విద్వాంసులు పండితులు అనుకుంటారు. ఒక గ్రుడ్డివానికి మరియొక అంధుడు దారిచూపిస్తాను అంటాడు.త్రాగినవాడు తూలుతున్నట్లు, మూఢులు కామములలో మైమరచిఉంటారు. ఈ మంత్రము ప్రక్షిప్తమని కొందరుభావిస్తారు. కాని ధర్మదేవతయే ఉత్తములను గురించిచెప్పునపుడు, మూఢుల ప్రస్తావన కూడా వచ్చినది. ఇదే మంత్రం ముండకోపనిషత్తులో ఉన్నది. అక్కడ ఎక్కువ సందర్బోచితంగా కనుపిస్తుంది. సాధన చేయాలిగాని కేవలం పాండిత్యముతో తత్త్వ విమర్శ చేయడం నిరుపయోగమనే సూచన ఈ మంత్రములో ఉంది.  

No comments:

Post a Comment