మనం మరచిన కథలు - శ్రీకాకుళం చరిత్ర
మాతాచ
గిరిజాదేవీ | పితాదేవో మహేశ్వరః |
బాంధవా
శివభక్తాశ్చ| స్వదేశే భువనత్రయం||
1
వార్తలలోని హైదరాబాద్ సంగతిని విస్మరించి, 52 ఏళ్ళనుండి ఉంటున్న బెంగుళూరు మహానగరాన్ని మరచిపోయి, చిన్ననాటి విజయవాడ, తాడేపల్లిగూడెంలను గుర్తుచేసుకోకుండా ఉన్ననాకు ఉన్నట్లుండి శ్రీకాకుళం చరిత్రమీద మనసు పోయింది. ఏ శ్రీకాకుళం? ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలవారికి కలలో కనుపించిన ఆంధ్రమహావిష్ణు స్థానము, కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని గ్రామం కానేకాదు. నాటి కళింగదేశం, ఆనాడు గంగవంశీయుల పాలనలోనిది. మూరు రాయర గండ, రాయల వారు ఈమార్గంలోనే వెళ్ళి కటకంలోని గజపతులను జయించారు. ఒరిస్సా సరిహద్దులోని (నవ) ఆంధ్రప్రదేశ్ ఉత్తర కొసన ఉన్న జిల్లా కేంద్రము. దీనికి శ్రీకాకుళం అన్న పేరు ఎందుకు వచ్చినది? ఈ పట్టణానికి ఎంత చరిత్ర ఉన్నది? మన ప్రభుత్వ సమాచార వెబ్సైట్లలో ఆచరిత్ర ఎందుకు ఉండదు? రేపు చూద్దాం. వంద సంవత్సరాలనాటి ఒక తెలుగు కథ చదువుతుంటే ఈ ప్రశ్నలు వచ్చాయి. ఆ కథ పేరు చెప్పగలరా?
శ్రీకాకుళం చరిత్ర
2
నాకు శ్రీకాకుళం గుర్తుకు రావడానికి కారణం
గురజాడ అప్పారావుగారి ఒక చిన్నకథ. గురజాడవారి కన్యాశుల్కం నాటకం 100 సంవత్సరాలు పైగా
అందరికి పరిచయమే. పాత్రలలో అధికభాగం బ్రాహ్మణులు. అగ్నిహోత్రావధానులు, వారి కుమారుడు వెంకటేశం, బాల్యవితంతువైన పెద్దకుమార్తె బుచ్చమ్మ, పెళ్ళికాని రెండవకుమార్తె, లుబ్ధావధానులు, ఆయన వితంతుకుమార్తె మీనాక్షి, కరణం రామప్ప పంతులు, న్యాయవాది సౌజన్యారావు పంతులు, గుంటూరు శాస్త్రులు, అతని శిష్యుడు, నాయకుడు గిరీశం, వీరందరూ బ్రాహ్మణులైతే, కథానాయకి మాత్రం ఉత్తమురాలైన వేశ్య. నాడు కొంతవరకు ఉన్న సాంఘిక దురాచారం
కన్యాశుల్కం. వేశ్యావృత్తి ఒక కులానికి, ఊరిలో ఒకవీధికి పరిమితమైనకాలమది. ఈనాటకం
ఇంత కాలమైనా నిత్యనూతనంగా ఆదరింపబడడానికి కారణాలు అనేకం.
అనేక విమర్శలు అనేక రకాలుగా వ్రాశారు. ఇది "Girls for Sale" అనేపేరుతో ఆంగ్లంలోకి
అనువదించబడింది కూడా. (పాత్రలు ఆనాటి బ్రాహ్మణ సమాజానికి, మధురవాణి ఆనాటి వేశ్యా సముహానికి ప్రతినిధులా? ఏమో తెలియదు. అప్పారావు గారుకూడా ఆ సమాజం ప్రతినిధులేకదా!)
సంఘసంస్కరణమాట
ఏమైనా అది మంచి హాస్యనాటకం. స్థలం విజయనగరం. కాలం 1890 ప్రాంతాలు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ యొక్కకాలం సుమారు 1660 ప్రాంతాలు
కథా స్థానం శ్రీకాకుళం. అప్పుడు జరిగిన ఒక ప్రముఖ చారిత్రక సంఘటన ఆసంఘటన శ్రీకాకుళం పైన, ఆవూరి ఒక బ్రాహ్మణ కుటుంబంపైన చూపించిన ప్రభావాన్ని ఆకథ హృద్యంగా చిత్రిస్తుంది.
మనం చర్చించబోయే ఆకథ పేరు “మతము, విమతము”. (ఈకథకే “గురజాడ సంపూర్ణరచనలు” సంపాదకత్వం వహించిన రమణారెడ్డిగారు పెట్టినపేరు పెద్దమసీదు). ఈ కథకు అప్పారావుగారు ఒక పీఠిక వ్రాశారు. అది నాకు శ్రీకాకుళం చరిత్రపై ఆసక్తి కలిగించింది.
(పీఠిక
- గోలకొండ పాదశాహీ వారి ఫర్మానాల సీలు ఇక్కడ విప్పబడుటంజేసి దీనికి సిక్కాఖోల్ లేక చికాకోల్ అన్నపేరు వచ్చినదని ఇక్కడవారందురుకాని అదినిజము కాదు. ఈపట్టణము బహుప్రాచీనమైనది. దీనిపేరు శ్రీకాకుళము. ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని క్షేత్రముండెను. దానిని పడగొట్టి షేర్ మహమ్మదు పెద్ద మసీదు కట్టెను. ఇది నిజము.)
ఈ పీఠిక నాకు శ్రీకాకుళము చరిత్రపై ఆసక్తి కలిగించినది. శ్రీకాకుళం చరిత్రలో ఇంకొక పేరుకూడా ఉంది. అది గుల్షనాబాద్.
రాజమండ్రి పెద్దమసీదు చరిత్ర కూడా ఇటువంటిదే.అక్కడ పూర్వపు నివాసి వేణుగోపాల స్వామి.
అయోధ్య, మధుర, కాశీ, ద్వారక, ఉజ్జయిని లోని ప్రాచీన దేవాలయాల చరిత్ర అందరికీ తెలిసినదే. కర్ణాటక రాష్ట్రంలోని హంపీ విజయనగరం, తెలంగాణాలోని వరంగల్ చరిత్ర అందరికీ తెలిసినదే. కోస్తా ఆంధ్రలోకూడా ఆలయవిధ్వంసంజరిగినదా? అనే ప్రశ్నకు సమాధానందొరికింది.
3
గురజాడవారి పీఠికలోని కథనానికి ఇంకా ఏమయినా ఆధారాలు దొరుకుతాయా అనివెదికాను. సహస్రాబ్దాలచరిత్ర ఉన్నా నేటిభారతీయులకు చరిత్రపై అవగాహన శూన్యం. శ్రీకాకుళానికి సంబంధించిన వెబ్సైట్లలో ఎక్కడా ప్రాచీన చరిత్ర కనబడలేదు. అనేక శోధనాపదములతో ఇంటర్నెట్
వెదికితే అక్కడక్కడ కొన్ని వివరాలు దొరికాయి. గురజాడ చెప్పిన షేర్ మహమ్మదు ఎవరు? ఎప్పుడు శ్రీకాకుళేశ్వర ఆలయ విద్వంసం జరిగినది.ఆ ఆలయం ఎప్పటిది. ఆలయ ప్రసక్తిలేక పోయినా మసీదు వివరాలు మసీదువారి సైట్ లోనే దొరికాయి. అవి ఇక్కడ -
Jamia Masjid (Srikakulam) - Probably the oldest standing structure in
Srikakulam. Built in 1641 with support from Sher Muhammad Khan, the first
Fouzdar of Chicacole circar, of the Qutbshahi dynasty of Hyderabad. There are
inscriptions in the mosque compound attesting to this fact. The garden around
the Masjid gave the town its old name 'Gulshanabad', meaning City of the
Gardens.
ఈ సంఘటన నేపథ్యంలోనిది గురజాడవారి కథ "మతము, విమతము". బహుశా ఆశీర్షిక నేడు అర్థంకాదని రమణారెడ్డిగారు పెట్టినపేరు "పెద్దమసీదు". ఈ నిర్మాణము జరిగిన కొన్ని సంవత్సరాలకు జరిగిన సంఘటనయే ఈ కథలో హృద్యముగ వర్ణించారు గురజాడ.
" మతము-విమతము" కథాకథనం బెట్టిదనిన .....
(కాలం సా.శ. 1650.) నారాయణభట్టు అనే 30 సంవత్సరాలబ్రాహ్మణ యువకుడు, కాశీలో శాస్త్రాధ్యయనం పూర్తి చేసుకొని తన మిత్రుడు 20 సంవత్సరాల పుల్లంభట్టుతో కలసి తూర్పునుండి శ్రీకాకుళంవచ్చే మార్గంలో నడుస్తూ ఆగ్రామానికి వస్తూ ఉంటాడు.ఊరు ఇంకా క్రోసెడుదూరం ఉండగానే నారాయణ హృదయం సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. స్నేహితునితో అంటాడు "పుల్లా! మా ఊరు వచ్చేశామురా. ఇలాంటి ఊరు భూప్రపంచములో ఉండబోదురా. కాళిదాసు అవంతిగురించి చెప్పిన మాటలు మాఊరికి కూడా వర్తిస్తాయిరా. ఏమి నది? ఏమిఊరు. శ్రీకాకుళేశ్వరుని క్షేత్రము వంటి మహాక్షేత్రమున్నదా? అదుగో" అంటుండగా నారాయణకు నోటమాట రాలేదు. నిశ్చేష్టుడై కొంతసమయం నిలబడిపోయాడు. "ఏమీస్వామీ, ఏమయినది" అని పుల్లంభట్టు అంటుండగా నారాయణ "యేమిచెప్పనురా, పుల్లా, కోవెలగోపురం మాయమైపోయినది రా! మనస్సు వికలమైపోయినది. ఈ ఊరికి నాకూ ఋణముచెల్లిపోయినది.మనము తిరిగి కాశీ పోదాము పద." పుల్ల అంటాడు "గోపురంకోసమా స్వామీ ఈ ఊరు అంత శ్రమపడి వచ్చాము. మరల అంతదూరం ఎక్కడ వెళ్ళగలము? మీకు గోపురమే కావాలంటే ప్రక్కనున్న మా ఊరిలో గోపురము క్షేమముగా ఉండిఉండవచ్చును కదా." "మీ ఊరు గోపురం నాకెందుకురా? నా చిన్నతనమంతా ఈ ఊరుగోపురం వద్దనే గడచినది. ఎప్పుడూ ఎక్కుతూదిగుతూ ఉండేవాళ్ళము. శివ శివా,
మీఊరి గోపురమును కూడా ఆ మ్లేచ్ఛులు పడగొట్టి ఉంటాఱ్ఱా."అంటాడు నారాయణ. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇద్దరూ ఊరి మధ్యలో పూర్వం గుడి ఉన్నచోట వెలసిన పెద్దమసీదు వద్దకు వస్తారు.
అక్కడ మసీదు స్తంభాలు చూసి నారాయణ మళ్ళీ "శ్రీకాకుళేశ్వరుని గుడిఉండిన చోటులోనే మ్లేచ్చులు ఈ మసీదు కట్టాఱ్ఱా." అనుకుంటుండగా పుల్లంభట్టు ఒక ప్రశ్న అడుగుతాడు. {ఇది హిందువులు
సోమనాథ దేవాలయాన్ని అనేక మార్లు పడగొట్టినప్పటినుంది
అడిగిన ప్రశ్న.) "దేవుడు ఎందుకు ఊరుకున్నాడు స్వామీ?" "ఆమాట ఏశాస్త్రంలోనూ కనబడలేదురా.పోనీ ఒక సారి మసీదువద్దకు వెడదాం రా" అంటాడు నారాయణ. మసీదు వద్దకు చేరగానే అక్కడ ఒక 50 సంవత్సరాలు
పైబడిన, గడ్డముపెంచుకొని ఉన్న ఒక తురక ఆయన చిలుంపీలుస్తూ కనబడతాడు. నారాయణ ఆయనను సమీపించి "సలాం సాహెబుగారూ, ఇక్కడ పూర్వము ఒక శివాలయముండెడిదికదా!" అని పలకరిస్తాడు.
ఒక నిముషము ఊరుకుని
ఆ తురకాయన "హాఁ సైతాన్-కా-ఘర్" అని ఊరుకుంటాడు. "ఏమిపాట్లొచ్చాయి శివునికి" అనుకుంటూ అయ్యా గుడిపక్కనే మామేనమామ, చేబ్రోలువారు, రామావధానులుగారు బస చేసే వారు. వారు ఊరు విడిచి వెళ్ళిపోయారా? మృతులైనారా?" అని నారాయణ ఆయనను ప్రార్థనాపూర్వకంగా అడుగుతాడు. సాయీబుగారు చిలుంగొట్టం పడేసి లేచి నిలబడి "నారాయణా" అంటూ సమ్మోదముగా పిలుస్తాడు.
4
శ్రీకాకుళం చరిత్రను వ్రాయడానికి ప్రేరణ ఆంధ్రప్రదేశ వర్తమాన చరిత్రలోని రాష్ట్ర విభజన అధ్యాయమే. ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్రలోని జిల్లాకేంద్రమైన శ్రీకాకుళానికి, హైదరాబాదుకు ఉన్న చారిత్రక సంబంధాల అన్వేషణయే. చరిత్రలో ఈ ఊరికి అనేక నగరాలతో సంబంధం ఏర్పడింది. ఒకానొక కాలంలో ఇది ఉత్తరమున వంగదేశంలోని దామోదరనది నుండి, పశ్చిమమున మధ్యప్రదేశంలో నర్మదానది ఉద్భవించిన అమర్ కంటక్ (వింధ్య సాత్పురా పర్వత ప్రదేశము)నుండి, దక్షిణమున గోదావరీ తీరంలోని రాజమహేంద్రవరము వరకు ఉన్న కళింగదేశంలోని అంతర్భాగం. మహాభారతంలో దీర్ఘతమస్సు అనే ముని కథ ఉన్నది. ఆయన ఆంగీరసుడు. ఋగ్వేద ఋషి. మంత్రద్రష్ట. భరద్వాజుని సోదరుడు. ఆయన పుత్రులే అంగ, వంగ, కళింగులు. కళింగుడు స్థాపించినది కళింగ
దేశం. మొదటి రెండూ నేటి బీహారు, బెంగాలు. మహాభారతములో అంగదేశముగా పిలువబడినది, అశోకుని సమయానికి మగధ రాజ్యముగా అయినది. సుమారు 2300 సంవత్సరాల క్రితం అశోకుడు చేసిన
యుద్ధం కళింగ యుద్ధము. కళింగ నామాన్ని ఎక్కువగా ఒడీషావారే వాడుకుంటున్నారు. విశాఖపట్టణం, భీమునిపట్టణం సముద్రతీరవీధిలోని నౌకా కేంద్రము పేరు INS-కళింగ.
5
సా.శ. 9 శతాబ్దము నుండి - 20 వ శతాబ్దమువరకు
గంగ వంశము కళింగదేశాన్ని 10వ శతాబ్దమునుండి, 15వ శతాబ్దమువరకు పరిపాలించినది. నేటి పశ్చిమ బెంగాలు, ఒడీశా, శ్రీకాకుళం నుండి బెజవాడ వరకు వ్యాపించిన విశాల సామ్రాజ్యమది. వారి మొదటి రాజధాని రాజధాని
నేటి శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం. కోణార్కలోని సూర్యదేవాలయమును నిర్మించినది వీరే. దేశం సుభిక్షముగా ఉండేది. అనేక దేవాలయాల నిర్మాణము జరిగినది.
12వ శతాబ్దంలో వారు రాజధానిని కటకానికి మార్చారు.
1324
ఢిల్లీ సుల్తానుల మొదటిదండయాత్ర. కాని వారిని ఆపగలిగారు.
1434
నాటికి గంగ వంశసామ్రాజ్యము అంతరించినది.
15-16
శతాబ్దాలలో గజపతుల పాలన. 16 వశతాబ్దంలోనే గోల్కొండ, విజయనగర్ రాజ్యాలతో యుద్ధాలలో రాజ్యంలో అధిక భాగాన్ని కోల్పోయారు.
1568
ముసల్మాన్ ప్రభువుల (మొఘలుల) దండయాత్రలు తిరిగి ప్రారంభం.
1641
కుతుబ్ షాహి వంశపు గోల్కోండ పాదుషా శ్రీకాకుళాన్ని వశంచేసుకున్నాడు.
దానికి
చిహ్నంగా ఆయన ఫౌజ్దార్ షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళేశ్వరుని క్షేత్రమును విధ్వంసముచేసి, ఇప్పుడు శ్రీకాకుళములో ఆత్యంత ప్రాచీనమైన కట్టడం జమియా మసీదు నిర్మాణం చేశాడు. ఈ విధ్వంసం కుతుబ్షాహీలలో ఏడవవాడైన అబ్దుల్లా కుతుబ్ షా (1626–1672)పాలనలో జరిగినది. ఊరు కు
నాటి రాజభాషలో గుల్షనాబాద్ అనిపేరు పెట్టారు. (గోల్కొండ ప్రభువులు షియా ముస్లిములు. పారశీక భాషకు ప్రాముఖ్యం. గుల్, గుల్షన్, గుల్ - ఏ - బకావలి, పారశీక పదాలే. ఫతే మైదాన్ లో ఫతే అంటే విజయము) చికాకోల్, చిక్కోలు పేర్లు కూడా అప్పుడేపుట్టాయి. ఋషికుల్య
నదినుండి ఇచ్చాపురం రాజ్యంలోని కాశీబుగ్గ వరకు గంజాం జిల్లాగా మార్చినది ముసల్మానులే అని ఇంపీరియల్ గెజెటీర్ కథనం. ఇది గోల్కొండ ప్రభువుల చికాకోల్ సర్కార్ లోని భాగం. .
గోల్కొండ
చరిత్ర
గోల్కొండలో కుతుబ్ షాహీల పరిపాలన 1515 ప్రాంతాలలో బహమనీ సుల్తానుల కూటమి విచ్చిన్నమయ్యాక ప్రారంభమైనది. 171 సంవత్సరాల అనంతరం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వశమైనది. షియా తెగకు చెందిన ముస్లిములు. మహమ్మదీయ రాజ్యమైనా కొందరు హిందువులు పదవులలో ఉండేవారు. వారిలో అక్కన్న, మాదన్నలు ప్రముఖులు. భక్తరామదాసును తహశిల్దారుగా చేసిన తానిషా గోల్కొండ నవాబే. ఆయనే అబ్దుల్ హసన్ కుతుబ్ షా లేక అబ్దుల్
హసన్ తానాషా. కుతుబ్ షాహీ వంశములో ఎనిమదవ మరియు ఆఖరి నవాబు. 1685లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలం నాయకత్వంలో గోల్కొండ పైకి దండయాత్ర చేశాడు. మొదట గోల్కొండకే విజయం లభించినా, చివరకు కొందరు సేనానుల నమ్మకద్రోహం వలన గోల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. అక్కన్న మాదన్నలు గోల్కొండ నడిరోడ్డులో హత్య చేయబడ్డారు.
1687లో ఔరంగజేబ్, అతని కొడుకు షా ఆలం కలిసి గోల్కొండ కోటపై దాడి చేసి ఆక్రమించుకున్నారు.
దాంతో శ్రీకాకుళం కూడా ముఘల్ ల చేతుల్లోకి వెళ్ళింది. మొఘలులు బలహీనపడిన తరువాత హైదరాబాదు రాజధానిగా నైజాం ప్రభుత్వము ఏర్పడినది. తరువాత
నిజాం నవాబులు ముఘల్ లకి వెన్నుపోటు పొడవడంతో డెక్కన్ ప్రాంతం నిజాం నవాబుల చేతుల్లోకి వెళ్ళింది.
హైదరాబాదు చరిత్ర
హైదరాబాదు నిర్మాణం 1591 లో కుతుబ్ షాహీల 5వ సుల్తాన్ కులీకుతుబ్ షాతో ఆరంభమయింది. 1687 నుండి
1724 వరకు మొఘలుల అధీనంలో ఉన్నది. 1724 లో అసిఫ్ ఝా ఢిల్లీనుండి స్వాతంత్ర్యము ప్రకటించుకున్నాడు.
1769 నుండి 1948 వరకు హైదరాబాదు నైజాం పాలన లోనే ఉన్నది. 1956 లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత మాత్రమే అక్కడ అధికసంఖ్యాకుల భాషయైన తెలుగుకు ఒక స్థానం ఏర్పడినది.
ఫ్రెంచ్
పాలన
1753
లో నైజామునవాబు సలబత్ జంగ్ చికాకోల్
సర్కారునూ, ఇతర ఉత్తర సర్కారులను వారి సైన్యపు ఖర్చులకోసం ప్రెంచ్ వారికి ధారాదత్తం చేశాడు. అప్పుడే హైదరాబాదులో ఫ్రెంచివారి సేనాధిపతి ఎం. డి బుస్సీ చిక్కోలుని వశపరచుకున్నాడు. ఇతడే 1757 బొబ్బిలియుద్ధంలోని
బుస్సీదొర. ఆనాడు బొబ్బిలి, విజయనగరాల స్పర్థల మధ్య బుస్సీదొర పాత్ర నేటి తెలుగు తగవులో రోమను దొరసాని ఆంటోనియా పాత్ర వంటిదే. మార్క్ ఆంటొనీ అనే రోమన్ ప్రముఖుడు 2100 సం. నాడు రోమన్ రిపబ్లిక్ లో ప్రముఖ పాత్ర వహించాడు.
బ్రిటిష్
పాలన
12 ఆగష్టు 1765
లో నిజాం నవాబుల నుంచి బ్రిటిష్ వారు శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి జిల్లాలని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
1765
శ్రీకాకుళం జిల్లా కేంద్రం. శ్రీకాకుళం పట్టణం వస్త్రాల తయారీ కేంద్రంగా ఉండేది. రాజ్య పాలనా కేంద్రం చెన్నపట్టణం (మదరాసు)పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ.
1794లో బ్రిటిష్ వాళ్ళు శ్రీకాకుళం జిల్లాని రద్దు చేసి గంజాం, విశాఖపట్టణం కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేశారు. గంజాం జిల్లా కోర్ట్ 1865 వరకు శ్రీకాకుళంలోనే ఉండేది.
1867లో బ్రిటిష్ వాళ్ళు శ్రీకాకుళం పట్టణాన్ని మునిసిపాలిటీగా ప్రకటించారు. 1875-1876లలో వచ్చిన
నాగావళి నది వరదలకి శ్రీకాకుళం పట్టణ జనాభా మళ్ళీ తగ్గింది. 1900 నాటి జనాభా లెక్కల ప్రకారం శ్రీకాకుళం పట్టణ జనాభా 18,000 ఉండేది.
1905లోబ్రిటిష్వాళ్ళు తిమ్మరాజు శివరావు పంతులు అనే భారతీయుణ్ణి పట్టణానికి మునిసిపల్ అధికారి లేక ఛైర్మన్ గా నియమించారు.
1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. గంజాం జిల్లాలోని తెలుగువాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలని మద్రాస్ రాష్ట్రంలో ఉంచి, ఒడియా మాట్లాడే ప్రాంతాలని ఒరిస్సాలో విలీనం చేశారు. అప్పట్లో గంజాం జిల్లాలో భాగంగా ఉన్న శ్రీకాకుళం తాలూకా పూర్తిగా విశాఖపట్నం జిల్లాలో విలీనం అయ్యింది.
1950
లో విశాఖపట్టణం జిల్లా విభజింపబడి శ్రీకాకుళం జిల్లా మళ్ళీ ఏర్పడినది.
1953
లో రాష్ట్రపు రాజధాని మద్రాసు నుండి కర్నూలుకు, 1956లో హైదరాబాదు నూతనముగా యేర్పడిన రాష్ట్రపు రాజధాని అయినది.
1
జూన్ 1979లో శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించబడ్డాయి.
ఘనమైన,
ప్రాచీనమైన చరిత్రకలిగిన శ్రీకాకుళానికి ఆ ప్రాంత రాజధాని నగరాలు వరుసగా ముఖలింగం, కటకం, హంపీ, గోల్కొండ, హైదరాబాదు, మద్రాసు, కర్నూలు, హైదరాబాదు, తరువాత ఎక్కడో (?) రాజధాని ఉన్నంత మాత్రాన ఒరిగినది ఏముంది? తరిగినది ఏముంది? ప్రజల మనోభావాలకు ఆనాడు, ఈనాడు కూడా పెద్దవిలువలేదని తెలుస్తూనే ఉన్నది. శ్రీ కాకుళం వారికి ఆఊరికి, ఆ జిల్లాకి జరిగిన అభివృద్ధి ముఖ్యం. ఉదాహరణకు
అక్కడకు 160 కిమీ దూరంలోని ఒడీశా లోని బ్రహ్మపూర్ (పాత పేరు బరంపురం) అభివృద్ధికి, ఆంధ్రప్రదేశములో శ్రీకాకుళం అభివృద్ధికి ఎవరయినా పోల్చి అధ్యయనం చేశారా? ఇవి ప్రస్తుత పరిస్థితులలో ఆలోచింపవలసిన విషయాలు.
శ్రీకాకుళానికి చారిత్రకంగా శాశ్వత నష్టం 1641లో శ్రీకాకుళేశ్వరుని ఆలయ విధ్వంసం. గోల్కొండ సుల్తానులవలన జరిగినది. గురజాడ వారి మతము-విమతము కథలో నారాయణ భట్టు శ్రీకాకుళాన్ని అవంతీ నగరంతో పోలుస్తాడు. ఇది కాళిదాసు ఉపమానం వంటిదే. ఉపమా కాళిదాసస్య అంటారు. కాళిదాసు తోను, ఆయన అవంతీ నగరంతోను పోల్చడం ఇక్కడ అందం. మేఘదూతలో వింధ్యపర్వత ప్రాంతంలో ఉన్న ఒక గంధర్వుడు హిమాలయాల్లో నివసించే తన ప్రియురాలికి ఆ వైపువెళ్ళే మేఘములతో సందేశం పంపిస్తాడు. దారిలో అవంతీ నగరపు శోభను, అక్కడ వెలసిన మహకాళేశ్వరుని సంధ్యాపూజను చూచి వెళ్ళమంటాడు. అవంతీ నగరం క్షిప్రా (శిప్రా) నది పక్కన ఉన్నది. శ్రీకాకుళం నాగావళిపై ఉన్నది. రెండూ ప్రసిద్ధ శివక్షేత్రాలే. ఈ పోలికలో ఇంకొక ధ్వని కూడా ఉన్నది. 1234-35లో బానిసవంశానికి చెందిన ఇల్టుట్ మిష్ అనే సుల్తాన్
మహాకాళేశ్వరుని ప్రాచీన ఆలయాన్ని ధ్వంసం చేశాడు. నాలుగు వందల సంవత్సరాల తరువాత మహారాష్ట్ర పేష్వా రాజులు తిరిగి
నేటీ ఆలయాన్ని నిర్మించారు నారాయణ భట్టు కాశీలో విద్యాభ్యాసం ముగించి స్వగ్రామానికి తిరిగి వస్తాడు. అప్పటికే కాశీలో విశ్వనాథాలయం అనేక పర్యాయాలు ధ్వంసం చేయబడి తిరిగి నిర్మింపబడినది. కాని శ్రీకాకుళంలో ఆప్రయత్నం జరగలేదు. ఇది కథలో అంతర్గతంగా ఉన్న చారిత్రక సమాచారం, నాటి హిందువుల ఆవేదన.
No comments:
Post a Comment