సాంఖ్య దర్శనం
కపిల మహర్షి చెప్పిన సాంఖ్య దర్శనం అత్యంత ప్రాచీనమైనది. భాగవతము మూడవ స్కంధములో ఈయన చరిత్ర ఉంది. భగవంతుడే గీతలో “సిద్దానాం కపిలో ముని" అని విభూతియోగములో చెప్పాడు. కపిలుని తల్లిదండ్రులు దేవహూతి, కర్దమ ప్రజాపతి. కపిలుడు సాంఖ్యాన్ని మొదట తల్లికే చెప్పాడు. సాంఖ్య దర్శనం అత్యంత ప్రాచీనము, భారతీయ తత్త్వ శాస్త్రానికి పునాది. పురాణములు, స్మృతులు, ఆయుర్వేదము, తంత్రములు, యోగశాస్త్రము మొదలైనవి సాంఖ్యములోని భావములను ఉపయోగించుకున్నాయి.సాంఖ్యమును సమ్యగ్దర్శనం అంటారు. ఈ జగత్తును సంపూర్ణముగా దర్శింపచేసేది అని అర్థము. సంఖ్యల జ్ఞానమే (enumeration and analysis) సాంఖ్యమని ఒక వ్యుత్పత్తి. జ్ఞానవంతుణ్ణి సాంఖ్యుడని వ్యవహరిస్తారు. మహాభారతము "సంఖ్య శబ్దమే ప్రకృతి" అని తెలుపుతూ ప్రకృతి చెప్పే చతుర్వింశతి (24) తత్త్వముల జ్ఞానము సాంఖ్యమనీ, వీటి ద్వారా మూలప్రకృతి స్వరూపమును దర్శించుట ఈ శాస్త్రము లక్ష్యమనీ చెబుతుంది. సంఖ్య పదానికి సదసద్వివేకమును పొందిన బుద్ధి అని కూడా అర్థము చెప్పవచ్చును. ఆ బుద్ధిని ఇచ్చే మార్గము సాంఖ్యము. మొత్తము శాస్త్రములో అరువది భాగములున్నాయి. అందువలన ఈ శాస్త్రాన్ని షష్టి తంత్రమని కూడా పిలుస్తారు. ఈ శబ్దము అహిర్బుధ్న్య సంహిత అనే వైష్ణవ ఆగమములోనూ, కాశ్మీర శైవములోను కనుపిస్తుంది. కపిలుని తరువాత ఆయన శిష్యుడు ఆసురి, ఆసురి శిష్యుడు పంచశిఖుడు మొదలైనవారు సాంఖ్యమును బోధించారు. వీరి ప్రసక్తి పురాణేతిహాసాల ద్వారా మాత్రమే తెలిసినది. సాంఖ్యము యొక్క ప్రాచీన గ్రంధములేవీ నేడు లభించవు. ఇప్పుడు లభించే ప్రాచీన గ్రంధము ఈశ్వరకృష్ణుని సాంఖ్య కారిక. ఈశ్వర కృష్ణుడు బహుశా గుప్తుల కాలము వాడు. సాంఖ్య కారికలోని అంశములు: సూత్ర ప్రతిపాదన, ప్రమాణ నిర్వచనము, అవయవ (శాస్త్రభాగముల) ప్రతిపాదన, అవయవ నిర్మాణము, సంశయ నివారణ, దిశా నిర్దేశము.
మొదటి సూత్రం
దుఃఖ త్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదాభిఘాతకే హేతౌ
దృష్టేసా'పార్థా చేత్ నైకాన్తాత్యన్తతో 'భావాత్
దుఃఖ త్రయము (తాపత్రయము - ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికములు) వలన దుఃఖ హేతువులపై జిజ్ఞాస, వాని నివారణకు మార్గాన్వేషణ మొదలౌతాయి. అగోచరమైన ఆ మార్గాలకై ప్రయత్నమే సాంఖ్య శాస్త్ర ప్రయోజనం.
సాంఖ్యములోని పంచవింశతి (25) తత్త్వములు ఇవి. 1. మూల ప్రకృతి - దీనికే ప్రధానమని పేరు. 2. మహత్ - ఇదే బుద్ధి అనబడుతున్నది. 3. అహంకారము. 4-8 పంచ తన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. 9-13 పంచ భూతములు - పృధ్వి, జలము, తేజస్సు,వాయువు, ఆకాశము. 14-18 పంచ జ్ఞానేంద్రియాలు - చక్షు, త్వక్, రసన, ఘ్రాణ, శ్రోత్రాలు. 19-23 పంచ కర్మేంద్రియాలు - పాయు, ఉపస్థ, పాణి, పాద, వాక్కులు. 24. మనస్సు. 25. పురుషులు (పురుషుడు). నిరీశ్వర సాంఖ్యములో పురుషులు (జీవులు) అనేకులు. సేశ్వర సాంఖ్యములో పురుషుడు పరమాత్మ.
ఈ తత్త్వములన్నిటిలో ఒక సంబంధము కనబడుతుంది. ద్రవ్యము యొక్క ఒక స్వరూపము నాశనమై వేరొక ద్రవ్యముగా పరిణామం చెందుతుంది. ఈ పరిణామాన్నేవికారము లేదా వికృతి అని వ్యవహరిస్తారు. పాలు పెరుగుగా మారడము, బీజము వృక్షముగా రూపుదిద్దుకోవడము దీనికి ఉదాహరణలు. మూలప్రకృతి ప్రకృతి ఐతే, మహత్తత్త్వము అనగా బుద్ధి దానికి వికృతి. బుద్ధినుండి అహంకారము పుట్టుచున్నది.బుద్ధి అనే ప్రకృతికి అహంకారము వికృతి. అహంకారము వలన పంచ తన్మాత్రలు, తన్మాత్రల వలన పంచభూతములు పుట్టినవి. పంచ భూతములు, జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనస్సు ఈ పదియారును కేవలము వికృతులు. వీటిని షోడశ వికారములని పిలుస్తారు. ఈ 24 జడమైన ప్రకృతికి సంబంధించినవి. పురుషుడు (జీవుడు) చైతన్య స్వరూపుడు. ప్రకృతి కాడు, వికృతీ కాడు. మనస్సు, దేహము, ఇంద్రియములన్నిటికీ భిన్నుడు. సాక్షివలె ఉంటూ ప్రపంచ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. ప్రపంచ వ్యవహారాలను నడిపేది ప్రకృతి.
జీవుడు అజ్ఞానము వలన అనాత్మలైన దేహము,ఇంద్రియముల వలన లభించిన సుఖ,దుఃఖాలను తనమీద ఆరోపించుకొని ఆ సుఖదుఃఖాలను భోక్తగా అనుభవిస్తాడు. ఈ అజ్ఞానము పోగానే తాను నిర్లిప్తత తో లౌకిక వ్యవహారాలను గమనిస్తాడు. ఇదే ముక్త స్థితి లేదా కైవల్యము.
సాంఖ్య కారిక విశేషాలు మరికొన్ని: సాంఖ్యము ప్రత్యక్ష, అనుమాన, శబ్ద (ఆప్త వచన) ప్రమాణాలను గుర్తిస్తుంది. మూలప్రకృతి అనుమాన సిద్ధము. ప్రతి కార్యము దాని కారణములో అంతర్గతముగా ఉంటుంది. స్వర్ణము లేనిదే ఆభరణము రాదు. స్వర్ణము ఉపాదాన కారణము, స్వర్ణకారుడు నిమిత్త కారణము. సత్త్వ రజో తమస్సులు ద్రవ్యాత్మకమైన త్రిగుణములు. ఈశ్వరుని గుర్తిస్తే అతడు పురుషుడై నిమిత్త కారణముగానూ, ప్రకృతిని తానే సృష్టించి ఉపాదాన కారణముగానూ ఉన్నాడు. ప్రతి జీవునియందును తనచేకల్పితమైన మాయవలన తానే భోక్తయను అహంకారమును కలిగించి సాక్షిగా నిలిచిన ఈశ్వరుడున్నాడు. మహాప్రళయమందు అసంఖ్యాకులైన జీవులను తనయందు దాచుకొనిన మాయ, ప్రధానము, అవ్యక్తము, అజ్ఞానము, అవిద్య, తమస్సు, సుషుప్తి అని అనేక నామములతో పిలువబడే మూలప్రకృతి ఇదే. మహత్తత్త్వానికి మరియొక పేరు బుద్ధి. ఆలోచనతో కూడిన వివేచన దాని లక్షణము. బుద్ధికే మతి, ఖ్యాతి, జ్ఞానము, ప్రజ్ఞ అనే నామాలున్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారాలు పురుషార్థ సాధనకై వాటి పనులు అవిచేస్తాయి. సృష్టిలో దేవ,మానవ, జంతు, వృక్ష వర్గాలున్నాయి. దేవతలు సత్త్వ ప్రధానులు, మానవులు రజోప్రధానులు, జంతు, వృక్షములు తమోప్రధానులు. ఒకొక దర్శనము సృష్టిని ఒకొక విధముగా వర్ణిస్తుంది. వైశేషికులది ఆరంభవాదము. సృష్టి అణువులతో ప్రారంభించి ఒక బాహ్య శక్తిచేత నిర్మింపబడుతుంది.సాంఖ్యులది పరిణామవాదము. కార్యము (ఉపాదాన) కారణములో ఉంటుంది. ద్రవ్యముల పూర్వధర్మములు మారి వేరు ధర్మములు పుట్టడము పరిణామము. (ఉదా: పాలు పెరుగుగా మారుట.) అద్వైత వేదాంతులది వివర్తవాదము. పరబ్రహ్మమే జగత్తు అనే మిధ్యా ప్రతిబింబముగా కనుపించుట.
No comments:
Post a Comment